
పోటాపోటీగా కేటీఆర్ కు మంత్రులు, ఎమ్మెల్యేల ఫిర్యాదు
రోజంతా రెబల్స్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్చర్చలు
జూపల్లిపై మంత్రి నిరంజన్ కంప్లయింట్
తుమ్మలపై ఉపేందర్.. మహేందర్‌రెడ్డిపై పైలట్ ఆరోపణలు
కల్వకుర్తిలో కసిరెడ్డి వర్సెస్ జైపాల్
మంత్రి సత్యవతిపై రెడ్యానాయక్, ఎంపీ కవిత ఫైర్
ఫిర్జాదిగూడ పరిస్థితి వివరించిన మల్లారెడ్డి
రెబల్స్ ఆందోళనల కట్టడికి ఎమ్మెల్యేల ఇండ్లు,
పార్టీ ఆఫీసులకు అదనపు భద్రత
కేసీఆర్, కేటీఆర్ నియోజకవర్గాల్లోనూ తప్పని రెబల్స్ సమస్య
టీఆర్ఎస్లో సొంత పార్టీ నేతలే రె‘బెల్స్’ మోగించారు. దీనిపై ఎమ్మెల్యేలు, మంత్రులు పోటాపోటీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫిర్యాదులు చేసుకున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు రెబల్స్‌ను బుజ్జగించే పనిలో కేటీఆర్ నిమగ్నమయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలను తెలంగాణ భవన్‌కు పిలిపించుకొని విడివిడిగా భేటీ అయ్యారు. మున్సిపోల్స్ పోటీ నుంచి రెబల్స్‌ను తప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ప్రధానంగా మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్‌రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యేలు ఎక్కువగా ఫిర్యాదులు చేశారు. రెబల్స్‌ను ప్రోత్సహిస్తున్నారని, కల్పించుకొని పరిష్కరించాలని కేటీఆర్‌ను కోరారు. మంత్రి సత్యవతి రాథోడ్పైనా ఫిర్యాదులొచ్చాయి.
గులాబీ కండువాలతో రెబల్స్ ప్రచారం
పార్టీ కండువాలు కప్పుకుని రెబల్స్ ప్రచారం చేస్తున్నారని చాలా మంది ఎమ్మెల్యేలు కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. ‘టికెట్ ఇవ్వకున్నా పర్లేదు. మేం గులాబీ జెండాలతో ప్రచారం చేసుకుంటాం.. ఏం చేస్తారు’ అని రెబల్స్ ప్రశ్నిస్తున్నారని ఓ ఎమ్మెల్యే కేటీఆర్ కు తన నియోజకవర్గ పరిస్థితిని వివరించారు. బీ ఫారం కోసం తన ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే సునీత ఫిర్యాదు చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో రెబల్స్ ను బుజ్జగించడం సవాల్‌గా మారిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెబల్స్ లిస్టును కేటీఆర్ కు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫిర్యాదు చేస్తూ.. చౌటుప్పల్ మున్సిపాలిటీలో వీరేశం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై రెబల్స్‌ను బరిలోకి దించారని కేటీఆర్‌కు తెలిపారు.
మంత్రి సత్యవతిపై తండ్రీకూతుళ్ల ఫైర్
మంత్రి సత్యవతి రాథోడ్ పై తండ్రీకూతుళ్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీ కవిత కలిసి ఫిర్యాదు చేశారు. డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో మంత్రి తన అనుచరులతో పోటీ చేయిస్తున్నారని, మంత్రితో మాట్లాడి రెబల్స్ ను పోటీ నుంచి తప్పించాలని కోరారు. ఎన్నికల షెడ్యూలు వచ్చినప్పటి నుంచి మంత్రి సత్యవతి తన అనుచరులను ప్రోత్సహిస్తూ పోటీకి దించే ప్రయత్నం చేశారని వారు పేర్కొన్నారు.
జూపల్లిపై మంత్రి, ఎమ్మెల్యేల కంప్లయింట్స్
మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావుపై మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అబ్రహం, హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, ఐజా మున్సిపాలిటీల్లో జూపల్లి తన అనుచరులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేయించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు జూపల్లి ప్లాన్ వేశారని ఆరోపించారు. దీంతో కేటీఆర్ జూపల్లిని తెలంగాణ భవన్ కు పిలిపించుకొని సుమారు గంటపాటు సమావేశమయ్యారు. రెబల్స్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని జూపల్లి చెప్పారు. సమావేశం అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. నాయకుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం కామన్ అని అన్నారు. ‘ఎక్కడో ఏమో జరిగితే నాకు అంటకట్టడం సరికాదు. రెబల్స్ అనేది ఇప్పుడే కొత్త కాదు. గతంలో కూడా ఉంది. నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు’ అని ఆయన చెప్పారు.
తుమ్మల, పట్నంపై ఎమ్మెల్యేల ఫిర్యాదు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పాలేరులో తుమ్మల తన వర్గీయులు 20 మందిని బరిలోకి దింపారని, ఆయనను ఒప్పించి రెబల్స్ ను విత్ డ్రా చేయించాలని ఎమ్మెల్యే కోరారు. తాండూరు మున్సిపాలిటీలో రెబల్స్ బెడద లేకుండా ముందే కుదిర్చిన రాజీ బెడిసికొట్టింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన వాళ్లను పోటీకి దింపినట్లు కేటీఆర్ కు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
కసిరెడ్డి వర్సెస్ జైపాల్
కల్వకుర్తి, ఆమన్ గల్ మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితిపై ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పై ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ టికెట్ రాని వారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 6 వార్డుల్లో పోటీ చేశారు. వారంతా ఎమ్మెల్సీ కసిరెడ్డి అనుచరులని ఎమ్మెల్యే జైపాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అనుచరులు ఎవరూ పోటీ చేయడం లేదని కేటీఆర్ కు కసిరెడ్డి వివరణ ఇచ్చారు. ‘ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంటో తేలిపోతుంది’ అంటూ ఎమ్మెల్సీ కసిరెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేస్తూ తెలంగాణ భవన్ నుంచి జైపాల్ యాదవ్ వెళ్లిపోయారు.
దయాకర్‌రెడ్డి ఏడ్చిండన్న మల్లారెడ్డి
ఫిర్జాదిగూడ మేయర్ అభ్యర్థిపై వివాదాన్ని కేటీఆర్ మంత్రి మల్లారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. దుర్గా దయాకర్ రెడ్డి ఇంటికి ఎంపీ రేవంత్ రెడ్డి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పడాన్ని, ఆ తర్వాత దయాకర్ రెడ్డిని తాను బుజ్జగించడాన్ని మల్లారెడ్డి వివరించారు. దయాకర్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ పార్టీని వీడరని, కాంగ్రెస్ కండువా కప్పుకున్నందుకు తన వద్ద గంటసేపు ఏడ్చారని కేటీఆర్‌కు మంత్రి తెలిపారు.
మున్సిపోల్స్ను ఈజీగా తీసుకోవద్దు
మున్సిపల్ ఎన్నికలను ఈజీగా తీసుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఎక్కువ మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, సంక్షేమ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. పార్టీ నుంచి రెబల్స్‌గా పోటీకి దిగినవారితో మాట్లాడి నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. శనివారం తెలంగాణ భవన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. మున్సిపోల్స్‌లో అనుసరించాల్సి వ్యూహంపై చర్చించారు. ఆయా పట్టణాల్లో వచ్చిన నామినేషన్లు, పార్టీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్య, ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారి వివరాలను ఆయన నేతలను అడిగి తెలుసుకున్నారు. పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు. నామినేషన్లు పూర్తయినందున ప్రచారంపై ఫోకస్ పెట్టాలన్నారు. బీ ఫాంల అందజేత విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. పట్టణాల్లో ఉన్న పరిస్థితులను కేటీఆర్ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయం ఖాయమని, పట్టణ ప్రజల నుంచి పార్టీకి మంచి స్పందన లభిస్తున్నదని ఎమ్మెల్యేలు తెలిపారు. మంత్రులు సైతం తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల సన్నాహాలు, ప్రచారం, పరిస్థితులను కేటీఆర్‌కు వివరించారు. కేటీఆర్‌తో సమావేశమైన మంత్రుల్లో నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.