
- అక్రమంగా మట్టి తవ్వుతున్నారని ప్రశ్నించినందుకు అటాక్
- తీవ్ర గాయాలతో దవాఖానాలో చికిత్స
మానకొండూర్ వెలుగు : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని లలితాపూర్ సర్పంచ్, టీఆర్ఎస్ లీడర్మర్రి కొండయ్య స్థానిక బీజేపీ లీడర్ చిరంజీవిపై దాడి చేశాడు. అనుమతులు లేకుండా మట్టిని తరలించి అమ్ముకోవడం ఏమిటని ప్రశ్నించినందుకు కట్టెలతో కొట్టి కింద పడేసి కాలితో తొక్కాడు. బాధితుడు తీవ్రంగా గాయపడడంతో సర్కారు దవాఖానాకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే...సర్పంచ్ కొండయ్య గురువారం గ్రామ శివారులో జేసీబీలతో మట్టిని తవ్విస్తున్నాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు కాల్వ చిరంజీవి అక్కడికి వెళ్లి అధికారుల పర్మిషన్ లేకుండా మట్టిని ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించాడు. అక్కడి నుంచే తహసీల్దార్ కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన సర్పంచ్ మరికొంతమంది టీఆర్ఎస్నాయకులతో కలిసి చిరంజీవిపై కట్టెలతో అటాక్ చేశాడు. కింద పడేసి కాలితో తొక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ఈ విషయంపై బీజేపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ స్పందించారు. అక్రమంగా మట్టిని తవ్వి అమ్ముకోవడమే కాకుండా ప్రశ్నించిన బీజేపీ లీడర్పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. సర్పంచ్‌పై ఫిర్యాదు చేశామని, కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళలు చేస్తామని హెచ్చరించారు.