పదవికి రాజీనామా చేసిన టీఆర్ఎస్ సర్పంచ్

పదవికి రాజీనామా చేసిన టీఆర్ఎస్ సర్పంచ్
  • రాజీనామా చేసిన ఊట్లపల్లి సర్పంచ్

అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం  ఊట్లపల్లి సర్పంచ్ సాధు జోత్స్నభాయి సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాజీనామా పత్రాన్ని ఎంపీఓ సీతారామరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఊట్లపల్లి పంచాయతీ ఎస్సీ మహిళకు  రిజర్వ్ కావడంతో తనను అధికార పార్టీ లీడర్స్ బలపరిచి గెలిపించారన్నారు. కొంతకాలంగా టీఆర్ఎస్​లీడర్లు అపోజిషన్ పార్టీతో చేతులు కలిపి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వేధిస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించేందుకు తన మామగారికి తనకు తెలియకుండా రూ. లక్ష అప్పుగా ఇచ్చారన్నారు. వారు చెప్పిన మాట వినకపోవడంతో ఇప్పుడు మా లక్ష మాకు ఇస్తావా.. రాజీనామా చేస్తావా అంటూ వేధింపులకు గురి చేస్తున్నారని, రాజీనామా చేస్తే అప్పు కొట్టేస్తామని చెప్పారన్నారు. క్రిస్టియన్ గా ఉండి బతుకమ్మ పండుగను చేస్తుంటే ఆ కార్యక్రమానికి గ్రామంలో మహిళలు రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాట్సాప్ గ్రూపులో తనను తిడుతూ అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతున్నారని కంటతడి పెట్టారు. సోషల్ వర్క్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ఫోటోను స్టేటస్ లో పెట్టుకుంటే దానిని కూడా సొంత పార్టీ లీడర్స్ రాజకీయం చేశారని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని, ఏ పని చేసినా సొంత పార్టీ నేతల నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని పదవిలో ఇమడలేక రాజీనామా చేసినట్లు తెలిపారు.