
హైదరాబాద్, వెలుగు: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ బిల్లుపై టీఆర్‌ఎస్ మరోసారి చిత్రమైన వైఖరి ప్రదర్శించింది. రాజ్యసభలో బిల్లుకు టీఆర్‌ఎస్ సభ్యులు మద్దతు పలికినా చర్చలో మాత్రం పాల్గొనలేదు. ఆర్టికల్ 370 రద్దు చాలా కీలకమైన పరిణామం కావడంతో సీఎం కేసీఆర్ ఉదయం నుంచే రాజ్యసభ వ్యవహారాలపై దృష్టి సారించారు. పార్టీ పార్లమెంటరీ పక్షనేత కె.కేశవరావుతో ఫోన్‌లో మాట్లాడి బిల్లుకు మద్దతు తెలపాలని సూచించారు. అంతకుముందే ప్రధాని మోడీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి జమ్మూకాశ్మీర్ బిల్లుకు మద్దతివ్వాలని కోరడం విశేషం. రాజ్యసభలో టీఆర్‌ఎస్‌కు ఆరుగురు సభ్యులుండగా.. డి.శ్రీనివాస్ కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. సోమవారం మిగతా సభ్యులతోపాటు ఆయన కూడా రాజ్యసభలో జమ్మూకాశ్మీర్ బిల్లుకు మద్దతు తెలిపారు. అయితే అంతకుముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో టీఆర్‌ఎస్ ఎంపీలెవరూ పాల్గొనలేదు. పార్టీ తరఫున అభిప్రాయాన్ని సభలో వ్యక్తం చేయలేదు.
ఇంతకుముందూ..
పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టిన పలు బిల్లుల విషయంలోనూ టీఆర్ఎస్ ఒక్కో రకంగా స్పందించింది. త్రిపుల్ తలాక్ బిల్లుపై ఓటింగ్‌కు వ్యూహాత్మకంగా గైర్హాజరైంది. తన మిత్రపక్షం ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటంతో టీఆర్‌ఎస్ పార్టీ కావాలనే బిల్లుకు దూరంగా ఉండి.. పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది. అంతకుముందు ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ టీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది. తాజాగా జమ్మూకాశ్మీర్ బిల్లుపైనా సైలెంట్‌గానే పని కానిచ్చేసింది. టీఆర్‌ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలని పలువురు నేతలను కోరినా.. స్పందించేందుకు నిరాకరించడం విశేషం.