కానిస్టేబుల్​ను చెప్పుతో కొట్టిన TRS వార్డ్ ​మెంబర్​

కానిస్టేబుల్​ను చెప్పుతో కొట్టిన TRS వార్డ్ ​మెంబర్​
  • ట్రిబుల్ రైడింగ్ చేస్తున్న కొడుకు పొటో తీశారని ఆగ్రహం
  • అరెస్ట్ చేసిన పోలీసులు

మల్కాజిగిరి, వెలుగు: బైకుపై ముగ్గురు ప్రయాణిస్తున్నారని ఫొటో తీసినందుకు ట్రాఫిక్​ కానిస్టేబుల్​ దాడికి పాల్పడ్డ ఐదుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్​స్టేషన్​ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ మన్మోహన్​యాదవ్​ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​గా పని చేస్తున్న మహ్మద్​ ముజాఫర్(27) గురువారం ఉదయం మౌలాలి కమాన్​ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో మౌలాలి నుంచి జెడ్​టీఎస్​వైపు టీఎస్ 13 ఈకె 3892 నెంబరు గల బైకు మీద ట్రిపుల్​​రైడ్​ చేస్తూ వెళుతున్న వారిని కానిస్టేబుల్​ ఫొటో తీశాడు. అది చూసిన ఆ ముగ్గురు ట్రాఫిక్​ కానిస్టేబుల్ వద్దకు వచ్చి బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

15 నిమిషాల తరువాత మల్కాజిగిరి 138 డివిజన్​ వార్డ్​మెంబర్, జేఏసీ నాయకురాలు సయ్యద్​ మహముదా బేగం భర్త, కొడుకుతో పాటు మరో ఇద్దరితో వచ్చింది. ‘నా కొడుకు బైక్​ఫొటో తీస్తావా. నీకు ఎంత ధైర్యం’ అంటూ ట్రాఫిక్​ కానిస్టేబుల్​ ముజఫర్​ను చెప్పుతో కొట్టింది. అలాగే కానిస్టేబుల్ ​వద్ద ఉన్న కెమెరాను లాక్కుంది. ఈ విషయాన్ని ముజాఫర్ అధికారులకు సమాచారం అందించాడు. ఆపై మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు టీఆర్​ఎస్​ నాయకురాలు, వార్డు​మెంబర్ ​సయ్యద్​ మహముదా బేగం, ఆమె భర్త సయ్యద్​ గఫార్ హుసాని, కొడుకు సయ్యద్​ సాదిక్​ హుసాని(21), బంధువులు గౌస్​(29), మాజిద్​(34)లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 332, 382, 506 ఆర్​/డబ్లూ 34 ఐపీసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.