టీఆర్ఎస్ దే నర్సంపేట ఎంపీపీ

టీఆర్ఎస్ దే నర్సంపేట ఎంపీపీ

నర్సంపేట, వెలుగు: వరంగల్​ రూరల్​జిల్లాలోని నర్సంపేట మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా కాంగ్రెస్ 6, టీఆర్ఎస్​5 స్థానాలు గెలిచాయి. ఎంపీపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనుకున్న టీఆర్ఎస్ సీనియర్​నాయకులు ముగ్గురు కాంగ్రెస్​ఎంపీటీసీల మద్దతు కూడగట్టారు. దీంతో టీఆర్ఎస్ నాయకురాలు మోతే కళమ్మ ఎంపీపీగా ఎన్నికైంది. కాంగ్రెస్​నుంచి టీఆర్ఎస్ లో చేరిన బంజీపేట ఎంపీటీసీ అజ్మీర మౌనిక  వైస్​ఎంపీపీగా ఎన్నికైంది.

తీవ్ర ఉద్రిక్తత

ఎంపీపీ ఎన్నికకు పూర్తి ఆధిక్యం ఉండడంతో కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్​లో క్యాంపు నిర్వహించారు. టీఆర్ఎస్ ఐదుగురు సభ్యులతో క్యాంపు నిర్వహిస్తూనే కాంగ్రెస్ ఎంపీటీసీలకు గాలం వేసింది. దీంతో మొదట బాంజిపేట ఎంపీటీసీ  అజ్మీర మౌనిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. ఆమె బాటలో రాజుపేట ఎంపీటీసీ వీరన్న సైతం ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు అజ్మీర మౌనిక భర్త తనకు, తన భార్యకు కాంగ్రెస్ నాయకులతో ప్రాణభయం ఉందని గురువారం రాత్రి నర్సంపేట టౌన్​ పోలీస్​ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్నెపెల్లి ఎంపీటీసీ ఒల్లేరావు రజిత కాంగ్రెస్ పార్టీ క్యాంపులో ఉండగానే ఆమె భర్త బుచ్చయ్య తన భార్య రజితను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టౌన్​ ఎస్సై నాగనాథ్​కాంగ్రెస్ కార్యాలయంలో ఉన్న రజితను పోలీస్​స్టేషన్​కు తరలించారు. అనంతరం భర్త బుచ్చయ్యకు ఆమెను అప్పగించగా టీఆర్ఎస్ వాహనంలో తీసుకెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా చెప్పులతో రజిత, టీఆర్ఎస్ నాయకులపై దాడులు చేశారు. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఆగ్రహించిన కాంగ్రెస్​నాయకులు పోలీస్​స్టేషన్​ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.