రిటర్నింగ్ ఆఫీసర్ను బదిలీ చేయడం దారుణం: కేటీఆర్

రిటర్నింగ్  ఆఫీసర్ను బదిలీ చేయడం దారుణం: కేటీఆర్
  • రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది
  • మునుగోడులో ఓటమి తప్పదనే బీజేపీ అడ్డదారులు తొక్కుతోంది
  • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్

హైదరాబాద్: 2011లో తొలగించిన రోడ్డు రోలర్ గుర్తును మళ్లీ ఎలా కేటాయిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ ఎలక్షన్ కమిషన్ పై మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి రోడ్డు రోలర్ గుర్తును తొలగించిన రిటర్నింగ్ ఆఫీసర్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం దారుణమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ అందుకు తాజా ఉదాహరణ అని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్.. బీజేపీ చెప్పినట్లుగా నడుచుకుంటోందని ఆరోపించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఈసీ వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. 

తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులను కేటాయించడం ద్వారా ఓటర్లను అయోమయానికి గురి చేసి దొడ్డిదారిన ఓట్లు పొందేందుకు బీజేపీ కుట్రలు పన్నిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని అర్థమైంది కాబట్టే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. బీజేపీ కుట్రలను మునుగోడు ప్రజలు గమనిస్తున్నారని, ఉప ఎన్నికలో బీజేపీని ఓడించి టీఆర్ఎస్ ను గెలిపిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.