ఇప్పటికే ఇరాన్ పై యుద్ధం ప్రారంభమై దాదాపు 5 వారాలు దాటేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం దీనిని ముగించటానికి నానా కష్టాలు పడుతున్నారు. గంటకో మాట రోజుకో నిర్ణయంతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా అమెరికాలో కూడా ఆయనపై వ్యతిరేకతను పెంచేస్తున్నాయి. ఏకంగా ట్రంప్ నిర్ణయాలపై అమెరికన్లు రోడ్డెక్కి నిరసనలు చేపట్టడంతో ఆయనపై రోజురోజుకూ ఒత్తిడి పెరిగిపోతోందని నిపుణులు అంటున్నారు.
ఈ క్రమంలో ట్రంప్ అనూహ్య నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. హార్మూజ్ జలసంధి పూర్తిగా రీఓపెన్ కానప్పటికీ.. అమెరికా స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ముగించడానికి మొగ్గు చూపుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. ప్రపంచ ఇంధన అవసరాలకు అత్యంత కీలకమైన ఈ జలసంధిపై ఇరాన్ పట్టు సడలకముందే యుద్ధం నుంచి తప్పుకోవాలని ట్రంప్ భావించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ జలసంధిని తిరిగి తెరిపించే ప్రక్రియ అత్యంత క్లిష్టమైనదని, దానికి మరిన్ని వారాల సమయం పడుతుందని అంచనా వేసిన ట్రంప్.. తన ముందస్తు ప్లాన్ ప్రకారం 4 నుండి 6 వారాల్లోనే యుద్ధాన్ని ముగించాలని పట్టుబడుతున్నారట.
అమెరికా తన ప్రధాన లక్ష్యాలైన ఇరాన్ నేవీ, క్షిపణి నిల్వలను బలహీనపరచడంపైనే దృష్టి పెట్టనుందని ట్రంప్ ప్లాన్ ప్రకారం తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసిన తర్వాత.. దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా వాణిజ్య మార్గాలను తెరిపించాలని ట్రై చేస్తున్నారు ట్రంప్. ఒకవేళ అది విఫలమైతే.. జలసంధిని పునరుద్ధరించే బాధ్యతను మిత్రదేశాలైన యూరప్, గల్ఫ్ దేశాల కూటమికి అప్పగించాలని వాషింగ్టన్ భావిస్తోందని సమాచారం. హార్మూజ్ జలసంధి ద్వారా క్రూడ్ ఆయిల్ రవాణాను సురక్షితం చేయడం అనేది ట్రంప్ యుద్ధ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి కాదంటూ వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా షాక్ వేవ్స్ సృష్టిస్తోంది.
మెుత్తానికి ఒకవైపు యుద్ధం నుంచి తప్పుకోవాలని చూస్తున్న ట్రంప్.. మరోవైపు మధ్యప్రాచ్యంలో భారీగా సైనిక మోహరింపును పెంచుతుండటం గందరగోళానికి దారితీస్తోంది. ఇప్పటికే 2వేల 500 మంది మెరైన్లతో కూడిన యూఎస్ఎస్ ట్రిపోలీని అక్కడ మోహరించింది పెంటగాన్. అంతేకాకుండా మరో 10వేల మంది గ్రౌండ్ ట్రూప్స్‌ను పంపడంతో పాటు ఇరాన్ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునే మిషన్‌ను కూడా ట్రంప్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం యుద్ధం ముగిసిన తర్వాత అంతర్జాతీయ చట్టాల ప్రకారం లేదంటే వివిధ దేశాల కూటమి ద్వారా జలసంధి కచ్చితంగా తెరుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా ప్లాన్స్ ఎలా ఉన్నా జలసంధి విషయంలో మాత్రం తాము తగ్గేదేలే అంటో ఇరాన్. తమ నేవీని ధ్వంసం చేసినా పట్టుకొనసాగిస్తామని హెచ్చరిస్తూనే ఉంది. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ దాదాపు 100 డాలర్ల పైనే ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. సోమవారం నాడు ఇరాన్ చమురు బావులపై బాంబులు వేస్తామని హెచ్చరించిన ట్రంప్.. మంగళవారం నాటికి తన వైఖరిని మార్చుకుని యుద్ధం నుంచి ఎగ్జిట్ ప్లాన్ సిద్ధం చేయడం ట్రంప్ అస్థిరమైన విదేశాంగ విధానానికి అద్దం పడుతోంది. ఇరాన్‌ను పూర్తిగా లొంగదీసుకోకుండానే ట్రంప్ యుద్ధం నుంచి అమెరికా వెనక్కి తగ్గడం రష్యా, చైనా వంటి దేశాలకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది.
