గోల్డ్ కార్డుకు రూ.9 కోట్లు.. అమ్మకాలను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ గోల్డ్ కార్డ్ అంటే ఏంటంటే..

గోల్డ్ కార్డుకు రూ.9 కోట్లు.. అమ్మకాలను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ గోల్డ్ కార్డ్ అంటే ఏంటంటే..
  • కంపెనీలు కొంటే 18 కోట్లు.. అమ్మకాలను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 
  • విదేశీ విద్యార్థులకు ఇదొక వరం
  • ఫారినర్లను నియమించుకునే కంపెనీలకూ ప్రయోజనమని వెల్లడి

వాషింగ్టన్: అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇకపై తిరిగి సొంత దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని, యూఎస్‌‌లోనే ఉండేందుకు ‘గోల్డ్ కార్డ్’ ప్రోగ్రామ్‌‌ అవకాశం కల్పిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వీసా ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను కంపెనీలు నియమించుకోవచ్చునని వెల్లడించారు. గోల్డ్ కార్డ్ కోసం వ్యక్తులు ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ.9 కోట్లు), అదే ఉద్యోగులను నియమించుకునే కంపెనీలైతే రెండు మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. 

‘గోల్డ్ కార్డ్’ వీసా ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను బుధవారం వైట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో ట్రంప్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ఇదొక వరం. ప్రస్తుతం ఇక్కడ చదువుకుంటున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్లు.. చదువు అయిపోయిన తర్వాత తిరిగి సొంత దేశం వెళ్లిపోవాల్సి వస్తున్నది. 

అమెరికాలో ఉండేందుకు ఇమిగ్రేషన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత భారత్, చైనా, ఫ్రాన్స్.. ఇలా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమ సొంత దేశానికి వెళ్లాల్సి వస్తున్నది. ఇది చాలా దారుణం.. సిగ్గుచేటు. దీన్ని మేం సరిచేస్తున్నం. ఈ సమస్యకు గోల్డ్ కార్డ్ పరిష్కారం చూపుతుంది. దీన్ని కొనుగోలు చేసే విదేశీ స్టూడెంట్లు చదువు అయిపోయిన తర్వాత కూడా అమెరికాలో ఉండొచ్చు. 

అలాగే అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న స్టూడెంట్లను కంపెనీలు నియమించుకోవచ్చు. ఇందుకోసం గోల్డ్ కార్డ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది” అని వెల్లడించారు. ‘‘వీసా విధానాల వల్ల ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను తాము నియమించుకోలేకపోతున్నామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ సహా పలువురు నాతో చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పుడు ‘గోల్డ్ కార్డ్‌‌‌‌‌‌‌‌’ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌తో దీన్ని పరిష్కరించాం. గ్రీన్ కార్డు కంటే గోల్డ్ కార్డుతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి” అని పేర్కొన్నారు. అలాగే ఈ విధానంతో అమెరికాకు బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. 

ఐదేండ్ల తర్వాత సిటిజన్‌ ‌‌‌‌‌‌‌షిప్: లుట్నిక్
గోల్డ్ కార్డ్ కోసం వ్యక్తులు ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ.9 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. అదే ఉద్యోగులను నియమించుకునే కంపెనీలైతే రెండు మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. 

‘‘కంపెనీలు గోల్డ్ కార్డు కొనుగోలు చేసి ఉద్యోగిని నియమించుకోవచ్చు. ఆ ఉద్యోగి అర్హుడా? కాదా? అనేది నిర్ధారించేందుకు తనిఖీలు చేస్తం. ఇందుకు ప్రాసెసింగ్ ఫీజు కింద కంపెనీ 15 వేల డాలర్లు చెల్లించాలి. గోల్డ్ కార్డ్ కింద నియమితులైన ఎంప్లాయ్.. ఐదేండ్ల తర్వాత సిటిజన్‌‌‌‌‌‌‌‌షిప్ పొందవచ్చు. అదే కార్డ్ కింద కంపెనీ మరో ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌ని నియమించుకోవచ్చు. దీని ద్వారా ప్రతిభావంతులు మాత్రమే అమెరికాకు వచ్చేలా చూస్తాం” అని వివరించారు. 

హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వీసా ఇంటర్వ్యూలు వాయిదా.. 
హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా వాయిదా వేసింది. ఈ నెలలో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలను మార్చి, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌కు మార్చింది. హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వీసాదారులు ఇంటర్వ్యూల కోసం అమెరికా నుంచి ఇండియాకు వెళ్లొద్దని ఇమిగ్రేషన్ అధికారులు సూచించారు. ఈ మేరకు చివరి నిమిషంలో దరఖాస్తుదారులకు ఈ–మెయిల్ పంపించారు.