ఇండియాపై 100 శాతం టారిఫ్స్ వేయండి.. యూరోపియన్ దేశాలకు ట్రంప్ రిక్వెస్ట్..

ఇండియాపై 100 శాతం టారిఫ్స్ వేయండి.. యూరోపియన్ దేశాలకు ట్రంప్ రిక్వెస్ట్..

ఒకపక్క మోడీని దారితీలోకి తెచ్చుకునేందుకు జోలపాట పాడుతూనే మరోపక్క గిల్లుతున్నాడు ట్రంప్. యూఎస్ ప్రెసిడెంట్ ఐతే ఇండియాలో ఆయన మాట చెల్లుతుందా.. అస్సలు కాదని ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ తన చర్యలతో తేల్చి చెప్పేసింది. దీంతో చేసేది లేక తనకు ఇండియాతో బిజినెస్ కావాలి అలాగే అనుకున్న పని అవ్వాలి అన్నట్లు ట్రంప్ ప్రవర్తన చూస్తే అర్థం అవుతోంది.

తాజాగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ భారత్, చైనాలపై 100 శాతం సుంకాలు ప్రకటించాలంటూ యూరోపియన్ యూనియన్ ప్రతినిధులను రెచ్చగొడుతున్నాడు. దీంతో రష్యా నుంచి క్రూడ్ దిగుమతులను అడ్డుకుని పుతిన్ పై ఒత్తిడి పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు ట్రంప్. అలా అయితేనే పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ముగించటానికి చర్చలకు వస్తారని అమెరికా భావిస్తోంది. తమ లాగానే టారిఫ్స్ అస్త్రాన్ని ఉపయోగించాలని ట్రంప్ ప్రతినిధులు ఈయూ అధికారులను సంప్రదిస్తున్నారు. 

యూరోపియన్ యూనియన్ తమతో కలిసి ముందుకు సాగటానికి రావాలని అమెరికా కోరుకుంటోంది. ఇదే క్రమంలో ట్రంప్ ఇండియాపై ప్రస్తుతం ఉన్న సుంకాలను మరింతగా పెంచవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చైనా, ఇండియాలు రష్యన్ క్రూడ్ కొనటం నిలిపివేసే వరకు సుంకాలను కొనసాగించాలని అమెరికా యూరోపియన్ దేశాలకు పిలుపునిస్తోంది. వాస్తవానికి గతవారం టియాంజిన్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశంలో జీ జిన్‌పింగ్, పుతిన్, ప్రధాని మోడీ సమావేశమైన తర్వాత అమెరికా డైలమాలో పడింది. ఎలాగైనా ఈ కూటమిని కట్టడి చేయాలని ఇండియాను నయానా భయాన ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ట్రంప్ చూస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.