పిరికి పందల్లారా.. అమెరికా లేకుంటే మీరు కాగితపు పులులు: నాటో దేశాలపై ట్రంప్ ఫైర్

పిరికి పందల్లారా.. అమెరికా లేకుంటే మీరు కాగితపు పులులు: నాటో దేశాలపై ట్రంప్ ఫైర్

వాషింగ్టన్: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు మద్దతు ఇవ్వని నాటో దేశాలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. నాటో దేశ అధినేతలు పిరికి పందలని విమర్శించారు. అమెరికా మద్దతు లేకుంటే నాటో కూటమి ఒక కాగితపు పులి అని ఎద్దేవా చేశారు. అణుశక్తిగల ఇరాన్‌ను అడ్డుకోవడానికి జరుగుతున్న పోరాటంలో చేరడానికి సభ్య దేశాలు నిరాకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో దేశాలు మద్దతు ఇవ్వకున్న ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనిక విజయం సాధించిందని పేర్కొన్నారు. 

అధిక చమురు ధరలపై ఫిర్యాదు చేస్తోన్న నాటో కూటమి దేశాలు అందుకు కారణమైన హార్మూజ్ జల సంధికి విముక్తి కల్పించడం కోసం ఒక సైనిక ఆపరేషన్ చేపట్టడానికి మాత్రం ఇష్టపడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. హార్మూజ్ జల సంధికి విముక్తి కల్పించడంలో తోడ్పాటు అందించడం వాళ్లకు సులభం. ప్రమాదం కూడా తక్కువే. కానీ వాళ్లు పిరికి వాళ్లు. మేం అన్ని విషయాలు గుర్తుంచుకుంటామని ట్రంప్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. కాదు కూడదు అని ముందుకెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు. 

హార్మూజ్ జల సంధిలో చమురు నౌకలను కాపాడుకునేందుకు ఆయా దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపునిచ్చారు. హర్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలను మోహరించాలని కోరారు. ఇరాన్ నుంచి హార్మూజ్ జల సంధికి స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే.. ట్రంప్ పిలుపుకు ఆశించిన స్పందన రావడం లేదు. హార్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలు మోహరించేందుకు చైనా నిర్ద్వందంగా తిరస్కరించింది. 

బ్రిటన్ కూడా ఇందుకు సముఖత వ్యక్తం చేయలేదు. యుద్ధం ఇప్పుడు ముగిస్తారో ముందు ట్రంప్ స్పష్టంగా చెప్పాలని యూరప్ కంట్రీస్ డిమాండ్ చేశాయి. ఇక, ఇండియా అయితే ఈ అంశంపై రెస్పాండే కాకపోవడం గమనార్హం. హార్మూజ్ జల సంధి విషయంలో తన పిలుపును పట్టించుకోని దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హార్మూజ్ జల సంధి రక్షణ కోసం షరతులతో యూరప్ దేశాలు ముందుకు వచ్చాయి. కండీషన్స్ పెట్టడంతో నాటో కూటమిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.