నువ్వే కదా యుద్ధం చేద్దామని ముందుగా చెప్పింది : రక్షణ మంత్రిని టార్గెట్ చేసిన ట్రంప్..!

నువ్వే కదా యుద్ధం చేద్దామని ముందుగా చెప్పింది : రక్షణ మంత్రిని టార్గెట్ చేసిన ట్రంప్..!

ఇరాన్ యుద్ధ పాపం ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందో అనే భయమా లేక.. ఇరాన్ పై యుద్ధంలో వెనకడుగు వల్ల వచ్చిన నిర్వేదమా లేక ఇరాన్ యుద్ధం మొదలుపెట్టి తప్పు చేశాం అనే భావనా ఏంటో మరి.. మూడు వారాల ఇరాన్ పై యుద్ధం తర్వాత.. ఇప్పుడు ఆత్మపరిశీలనతోపాటు యుద్ధం ఎలా మొదలైంది అనే పునరాలోచనలో పడ్డారు ట్రంప్. అసలు యుద్ధం మొదలుపెడదాం అని మొదట చెప్పింది ఎవరు అనే విషయాలను ట్రంప్ బహిరంగంగా చెప్పటం ద్వారా చూస్తుంటే.. యుద్ధాన్ని అనవసరంగా మొదలుపెట్టాం అనే ఫీలింగ్ కు అమెరికా గట్టిగా వచ్చినట్లు స్పష్టం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

యుద్ధానికి ఐదు రోజుల విరామం ఇస్తున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన ట్రంప్.. లేటెస్టుగా యద్ధం ఎలా మొదలైందనే విషయంపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. యుద్ధం గెలవలేని పరిస్థితుల్లో, బయట పడటం అర్థికాని తరుణంలో ట్రంప్ బ్లేమ్ గేమ్ మొదలుపెట్టినట్లు ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్న తరుణంలో యుద్ధ నిర్ణయాన్ని మరొకరిపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారు. 

యుద్ధంపై ట్రంప్ లేటెస్టుగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇరాన్ పై స్ట్రైక్స్ చేయాల్సిందిగా.. యుద్ధానికి దిగాల్సిందిగా ముందుగా ప్రతిపాదించినది డిఫెన్స్ సెక్రెటరీ పీట్ హెగ్ సేత్ అని ప్రకటించారు మోదీ. ఈ వ్యాఖ్యలపై యూఎస్ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. 

2026 మార్చి 23న జరిగిన ఒక ఈవెంట్ లో.. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటానికి వీళ్లేదని.. దీన్ని అమెరికా అనుతించకూడదని డిఫెన్స్ సెక్రెటరీ అన్నారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. యుద్ధం ప్రారంభించాల్సిందిగా ముందుగా చెప్పింది మీరే కదా అంటూ హెగ్ సేత్ ను అన్నారు. ఈ కామెంట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ట్రంప్ డిఫెన్స్ లో పడ్డారని.. అందుకే నిందను ఇతరులపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 

అమెరికా ఇరాన్‌తో యుద్ధానికి ఎందుకు దిగింది? 

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ అధికారులు యుద్ధం విసయంలో కొందరు ట్రంప్ ను సమర్ధిస్తుండగా.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి అనివార్యమని, అందువల్ల అమెరికా జోక్యం ఒక వ్యూహాత్మక అవసరమని కొందరు అంటున్నారు. మరికొందరు ఇరాన్ అణ్వాయుధాలను మోహరించే అవకాశం ఉందని వాదిస్తున్నారు. దీనిపై ట్రంప్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. మధ్యప్రాచ్యంలోకి ఒక చిన్న ప్రయాణం చేసి, ఒక పెద్ద సమస్యను తొలగించే విషయంగా యుద్ధాన్ని ట్రంప్ అభివర్ణించారు.

సీక్రెట్ ఒప్పందం ఏదైనా జరుగుతోందా? 

పీట్ హెగ్సెత్ నేతృత్వంలోని పెంటగాన్, ఇరాన్ డ్రోన్ ,  క్షిపణి కార్యక్రమాలను నిర్మూలించడంపై దృష్టి సారిస్తుండగా, డొనాల్డ్ ట్రంప్ ఒకేసారి సీక్రెట్ ఒప్పందం స్టేట్ మెంట్స్ చేశారు. తన అల్లుడు జారెడ్ కుష్నర్ ,  రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్‌లోని ఒక అత్యున్నత వ్యక్తితో చర్చలు జరిపే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా యుద్ధాన్ని ఆపి హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవగలమని ట్రంప్ అన్నారు. లేని పక్షంలో బాంబులు వేస్తూనే ఉంటామన్నారు ట్రంప్. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. ఎలాంటి చర్చలు జరగటం లేదని తేల్చి చెప్పింది.