అమెరికా ఫండ్స్ తోనే ఇజ్రాయెల్ పై దాడి.. బైడెన్ సర్కారుపై ట్రంప్ ఫైర్

అమెరికా ఫండ్స్ తోనే ఇజ్రాయెల్ పై దాడి.. బైడెన్ సర్కారుపై ట్రంప్ ఫైర్

వాషింగ్టన్: ఇరాన్​కు అమెరికా అందించిన ఫండ్స్ హమాస్ మిలిటెంట్లకు చేరాయని, ఆ నిధులతోనే ఇజ్రాయెల్​పై ఇప్పుడు దాడులకు దిగుతున్నారని అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఆరోపించారు. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ సర్కారు తీరుతో ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన నిధులు మిలిటెంట్ల చేతుల్లోకి వెళ్లాయన్నారు. దీంతో బైడెన్ ప్రభుత్వం పరోక్షంగా మిలిటెంట్లకు ఫండింగ్ చేసినట్లైందని విమర్శించారు. ‘‘ఖైదీల అప్పగింత ఒప్పందం కింద ఇరాన్​కు బైడెన్ సర్కారు గత నెలలో 6 బిలియన్ డాలర్లు రిలీజ్ చేసింది. కానీ ఆ నిధులను ఇరాన్ హమాస్ మిలిటెంట్లకు అందించి దాడులు చేయిస్తోంది” అని ట్రంప్ ఆరోపించారు. అయితే, ట్రంప్ ఆరోపణలు సిగ్గుచేటని వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఖండించారు. 

ఇజ్రాయెల్​కు పూర్తి అండగా ఉంటాం: బైడెన్ 

హమాస్ మిలిటెంట్ల దాడులను సహించబోమని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్​కు పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని శనివారం సాయంత్రం ఆయన ప్రకటించారు.