
- బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అభిప్రాయ భేదాలు
- మస్క్‌కు సాయం చేసినా కృతజ్ఞత లేదన్న ట్రంప్
- తానే లేకుంటే ట్రంప్ గెలిచేవాడు కాదన్న మస్క్
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మధ్య స్నేహం చెడింది. ‘‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’’పై ఎలాన్ మస్క్ బుధవారం చేసిన విమర్శలపై ట్రంప్ గురువారం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి, ఈ బిల్లుపై మొదట్లో మస్క్‌కు అభ్యంతరాలు లేవని.. అయితే, ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మాండేట్ రోల్‌బ్యాక్ గురించి తెలిశాకే ఆయన బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. "నేను మస్క్‌కు చాలా సహాయం చేశాను.
అయినా అతనికి కృతజ్ఞత లేదు.ఈ బిల్లు గురించి ఆయనకు అంతా తెలుసు. అకస్మాత్తుగా, ఈవీ మాండేట్ను తొలగిస్తున్నామని తెలిసినప్పుడే మా మధ్య సమస్య మొదలైంది. అమెరికాలో ఉద్యోగాలను సృష్టించడంతోపాటు దేశ సరిహద్దు, సైనిక ఖర్చులను పెంచే ఉద్దేశంతోనే ఈ బిల్లును రూపొందించాం. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది" అని ట్రంప్ వెల్లడించారు. మస్క్‌తో తనకు గొప్ప సంబంధం ఉండేదని.. ఇకపై అది ఉంటుందో లేదో తెలియదన్నారు.
ట్రంప్ కు కౌంటర్ ఇచ్చిన మస్క్..
తాను మస్క్‌కు చాలా సహాయం చేశానని ట్రంప్ చేసిన కామెంట్లకు ఎలాన్ మస్క్ కౌంటర్ ఇచ్చారు. తాను లేకపోతే డొనాల్డ్ ట్రంప్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయేవారని తెలిపారు. "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్"ను తనకు ఒక్కసారి కూడా చూపించలేదన్నారు. కానీ దానిపై ట్రంప్ చేస్తున్న వాదనను ఖండింస్తున్నట్లు చెప్పారు. బిల్లులోని ఈవీ/సోలార్ ప్రోత్సాహకాల కోతలపై, అనవసర ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవలి కాలంలో ఇంత పెద్ద దారుణమైన బిల్లును చూడలేదన్నారు. బిల్లులోని ఖర్చులు ద్రవ్య లోటును పెంచుతాయని, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ ప్రభుత్వం, మస్క్ మధ్య ఉద్రిక్తతను మరింత పెంచాయి. రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చను రేకెత్తించాయి.