- టికెట్ కొనిచ్చి విమానంలో పంపిస్తామంటున్న ట్రంప్
- ‘ప్రాజెక్ట్ హోమ్ కమింగ్’ పేరుతో స్కీమ్
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులను వారి స్వదేశానికి తిప్పి పంపించేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘ప్రాజెక్ట్ హోమ్ కమింగ్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా స్వదేశాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న అక్రమ వలసదారులకు ‘ఎగ్జిట్ బోనస్’ పేరుతో నగదు అందజేస్తోంది. సెల్ఫ్ డిపోర్టేషన్ కు ముందుకు వచ్చిన వారికి 2,600 డాలర్లు (రూపాయల్లో దాదాపు 2.5 లక్షలు) నగదుతో పాటు విమాన టికెట్లు ఇచ్చి గౌరవంగా సాగనంపుతామని చెప్పింది. ఈ మేరకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) వెల్లడించింది.
భారత్‌లోని తాజ్ మహల్, కొలంబియా, చైనాలోని ప్రముఖ కట్టడాల చిత్రాలను ఉపయోగించి మరీ ఈ స్కీమ్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ‘‘కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు స్వదేశానికి వెళ్లండి. ఉచిత విమాన ప్రయాణంతో పాటు 2,600 డాలర్ల ఎగ్జిట్ బోనస్ పొందండి” అని ‘ఎక్స్’ వేదికగా పిలుపునిచ్చింది.
వివరాల నమోదుకు ప్రత్యేక యాప్
అక్రమ వలసదారులు సీబీపీ హోమ్ యాప్ లో తమ వివరాలను నమోదు చేసుకుంటే ప్రయాణ ఏర్పాట్లు, ఆర్థిక సాయంపై పూర్తి సమాచారం లభిస్తుందని తెలిపింది. ఇందులో వివరాలు నమోదు చేసుకున్నవారు నేరస్తుల్లా కాకుండా సాధారణ
ప్రయాణికుల మాదిరిగా గౌరవప్రదంగా స్వదేశానికి వెళ్లే వీలుంటుందని ప్రభుత్వం పేర్కొంది.
పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఆదా
ఒక అక్రమ వలసదారుడిని డిపోర్ట్ చేయడానికి అమెరికా ప్రభుత్వానికి 18,245 డాలర్లు ఖర్చవుతుంది. అదే స్వచ్ఛందంగా వెళ్తే అయ్యే ఖర్చు కేవలం 5,100 డాలర్లు మాత్రమే. దీనివల్ల ఒక్కో వ్యక్తిపై దాదాపు 13 వేల డాలర్ల (రూ.10.7 లక్షలు) ప్రజా ధనం ఆదా అవుతుందని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 22 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించు కున్నారని స్పష్టం చేశారు.
