- సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అన్ని దేశాలపై 10 శాతం విధింపు
- కాసేపటికే 15 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటన
- వెంటనే అమల్లోకి వస్తాయన్న అమెరికా ప్రెసిడెంట్
- భారత్‌కూ వర్తిస్తాయని వెల్లడి
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై టారిఫ్‌లను తప్పుపడుతూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్తగా 15 శాతం టారిఫ్ లను ప్రకటించారు. అన్ని దేశాలపై 10శాతం టారిఫ్ లు విధిస్తున్నామని, ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని శుక్రవారం వెల్లడించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఈ టారిఫ్‌లను 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.
దీనిని ఆయన "చట్టబద్ధంగా పరీక్షించబడిన" స్థాయిగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన తర్వాతే సుంకాలను 15 శాతానికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అంతకుముందు, కోర్టు తీర్పుపై ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. "భారత్‌తో నా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. వాణిజ్య ఒప్పందం కొనసాగుతుంది. అయితే పద్ధతి మాత్రమే మారింది. గతంలోలా కాకుండా ఇప్పుడు వారు మాకు టారిఫ్ లు చెల్లిస్తారు. మేం చెల్లించం" అని వ్యాఖ్యానించారు.
అయితే, ట్రంప్ తాజా ఉత్తర్వులతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకం18% నుంచి 10 శాతానికి తగ్గనుంది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 24 నుంచి అమలులోకి రానున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఫార్మా రంగానికి, యుఎస్--–మెక్సికో--–కెనడా ఒప్పందంలోని వస్తువులకు మాత్రం ఈ టారిఫ్ ల నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పుతో తన పాత నిర్ణయాలకు చట్టపరమైన ఆధారం కోల్పోవడంతో, ట్రంప్ 1974 నాటి ట్రేడ్ యాక్ట్‌లోని 'సెక్షన్ 122'ను ప్రయోగించారు.
దేశ ఆర్థిక లోటును అధిగమించేందుకు గరిష్టంగా 150 రోజుల పాటు 15% వరకు తాత్కాలిక సుంకాలు విధించే అధికారం ఈ సెక్షన్ అధ్యక్షుడికి కల్పిస్తుంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలన్నింటికీ వర్తించేలా 15% టారిఫ్‌లను ట్రంప్ ఖరారు చేశారు. అయితే, ఈ 150 రోజుల గడువు ముగిసిన తర్వాత కాంగ్రెస్ ఆమోదిస్తేనే ఈ సుంకాలు కొనసాగుతాయి. లేనిపక్షంలో అధ్యక్షుడు మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి ఉంటుంది.
భారత్‌కు ఊరటే, కానీ..
ఇటీవల రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు వ్యవహారంలో భారత్‌పై ఉన్న 25 శాతం సుంకాలను అమెరికా 18 శాతానికి తగ్గించింది. ఇప్పుడు తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రపంచ దేశాలన్నింటికీ 15 శాతం పన్ను వర్తించనుండటంతో భారత్‌కు కూడా18 శాతం పన్ను భారం తప్పనుంది.
