- బీబీసీపై 5 బిలియన్ డాలర్లకు దావా వేస్తానని వెల్లడి
- 2021 నాటి ఘటనలో అధ్యక్షుడి మాటలను వక్రీకరించిన బీబీసీ
లండన్: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) తనకు క్షమాపణ చెప్పినా తగ్గేది లేదని, తన మాటలను వక్రీకరించినందుకు ఆ సంస్థపై దావా వేయాలని నిర్ణయించుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. బీబీసీపై కనీసం ఒక బిలియన్ నుంచి 5 బిలియన్ డాలర్ల (రూ.8 వేల కోట్ల నుంచి రూ. 44 వేల కోట్లు) మధ్య దావా వేస్తానని తెలిపారు.
శనివారం తెల్లవారుజామున ఎయిర్ ఫోర్స్ వన్ (అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం) లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘క్యాపిటల్ హిల్ పై దాడికి సంబంధించి నా మాటలను వక్రీకరించినట్లు బీబీసీ వారు ఒప్పుకున్నారు. నా నోటి నుంచి వచ్చిన మాటలను మార్చారు. వారు మోసం చేశారు. కాబట్టి వారిపై దావా వేయాల్సిందే.
ఈ విషయంలో ఇప్పటికే బీబీసీ యాజమాన్యం నాకు క్షమాపణ చెప్పింది. అయినా వెనక్కి తగ్గను. ఎందుకంటే వారు మరోసారి తప్పు చేయకుండా ఉండాలి” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఏంటీ వివాదం?
2021 జనవరి 6న అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగింది. అంతకుముందు వాషింగ్టన్ డీసీలో తన మద్దతుదారులతో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ‘‘క్యాపిటల్ హిల్‌కు మనమంతా వెళుతున్నాం. మన సెనేటర్లు, కాంగ్రెస్ మెన్, వుమెన్‌ను ఉత్సాహపరచడానికి అక్కడికి వెళుతున్నాం. అందుకోసం మనం తీవ్రంగా పోరాడుతం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ నిరుడు అక్టోబరులో బీబీసీ ‘పనోరమ’ అనే డాక్యుమెంటరీ టెలికాస్ట్ చేసింది. తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, హింసకు పాల్పడేలా ప్రోత్సహించారని కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. దీంతో బీబీసీ యాజమాన్యంపై గతంలోనే ట్రంప్ మండిపడ్డారు. తనకు సారీ చెప్పాలని, దాంతోపాటు ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇందుకు బాధ్యత వహిస్తూ బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, హెడ్ ఆఫ్ న్యూస్ డెబోరా టర్నెస్ తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అంతేకాకుండా ట్రంప్ కు మేనేజ్ మెంట్ సారీ చెప్పింది. అయితే, పరిహారం చెల్లించబోమని తేల్చి చెప్పింది.
