రష్యా, ఉక్రెయిన్​ మధ్య సీజ్​ఫైర్​ చర్చలు స్టార్ట్​..ఇక యుద్ధం ముగిసినట్లే: ట్రంప్

రష్యా, ఉక్రెయిన్​ మధ్య సీజ్​ఫైర్​ చర్చలు స్టార్ట్​..ఇక యుద్ధం ముగిసినట్లే: ట్రంప్

వాషింగ్టన్​: రష్యా, ఉక్రెయిన్​ మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న వార్​ ముగిసినట్లేనని.. రెండు దేశాల మధ్య సీజ్​ఫైర్​కు చర్చలు ప్రారంభమయ్యాయని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్​తో తాను గంటపాటు ఫోన్​లో మాట్లాడానని ఆయన సోమవారం రాత్రి ట్వీట్​ చేశారు. ‘‘పుతిన్​తో సంభాషణ చాలా బాగా జరిగింది. సీజ్​ఫైర్​ కోసం రష్యా, ఉక్రెయిన్​ మధ్య వెంటనే చర్చలు ప్రారంభమవుతాయి. ఈ చర్చలతో యుద్ధం ముగింపుకు తొలి అడుగు పడుతుంది” అని పేర్కొన్నారు.

 పుతిన్​తో ఫోన్​లో మాట్లాడిన అనంతరం ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలన్​స్కీ, యూరోపియన్​ కమిషన్​ చీఫ్​ ఉర్సులా వాన్​ డేర్​ లేయన్​, ఫ్రాన్స్​ ప్రెసిడెంట్​ మాక్రాన్​, ఇటలీ ప్రధాని మెలోనీ, జర్మనీ చాన్సలర్​ ఫ్రెడరిక్​ మెర్జ్​, ఫిన్లాండ్​ ప్రెసిడెంట్​ అలెగ్జాండర్​ స్టబ్​తో కాన్ఫరన్స్​ కాల్​లో మాట్లాడానని ట్రంప్​  తెలిపారు. రష్యా, ఉక్రెయిన్​ మధ్య కాల్పుల విరమణ చర్చలు వెంటనే స్టార్ట్​ అవుతాయని వారందరికీ తాను తెలియజేసినట్లు వివరించారు.  ఈ చర్చలకు వాటికన్​ సిటీ వేదిక అవుతుందని తెలిపారు. ‘‘రెండు దేశాల మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న యుద్ధం ఇక ముగిసినట్లే.  ఇక అమెరికాతో రష్యా, ఉక్రెయిన్​ ట్రేడ్​ డీల్​ బలపడుతుంది. ఇది ఆ రెండు దేశాలకు, అక్కడి ప్రజలకు మంచి పరిణామం” అని ట్వీట్​లో   ట్రంప్​పేర్కొన్నారు.