మా ఆమోదం లేకుండా మొజ్తబా ఖమేనీ ఎక్కువ రోజులు ఉండడు: ట్రంప్

మా ఆమోదం లేకుండా  మొజ్తబా ఖమేనీ ఎక్కువ రోజులు ఉండడు: ట్రంప్
  • ఇరాన్ కొత్త సుప్రీం ఎంపికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​
  • మా అంగీకారం తప్పకుండా ఉండాల్సిందేనంటూ ఇరాన్​కు వార్నింగ్
  • మొజ్తబా ఖమేనీ ఒక అసమర్థుడని ఫైర్
  •     లేకుంటే అతను ఎక్కువ కాలం ఉండడు
  •     ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
  •     మొజ్తబా ఖమేనీ ఒక అసమర్థుడని ఫైర్ 

వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎన్నుకోబోయే తదుపరి సుప్రీం ఎవరైనా.. అతనికి అమెరికా ఆమోదం కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. ఒకవేళ తమ ఆమోదం లేకుంటే కొత్త నాయకుడు ఎక్కువ కాలం సుప్రీం పదవిలో ఉండబోడని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం, రాజకీయ మార్పుల ద్వారా అమెరికా,  ఇరాన్ మధ్య ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తన లక్ష్యమన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు." మా ఆమోదం లేకుండా ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ గా ఎన్నికైన వ్యక్తి ఎక్కువ కాలం ఆ పదవిలో ఉండడు. మొజ్తబా ఖమేనీ ఒక అసమర్థుడు. అతను ఇరాన్ సుప్రీం లీడర్ కావడం అమెరికాకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అతడిని సుప్రీంగా అమెరికా గుర్తించబోదు. మా ఆమోదంతో ఇరాన్  సమర్థవంతమైన నాయకుడిని ఎంచుకుంటే.. ఆ దేశాన్ని అత్యంత బలమైన దేశంగా మారుస్తాం" అని చెప్పారు. 

ప్రతి పదేండ్లకోసారి యుద్ధం చేయలేం

అమెరికా, ఇరాన్ మధ్య తరచూ జరుగుతున్న యుద్ధలపైనా ట్రంప్ స్పందించారు." ఇరాన్ తో అమెరికాకు సమస్యలున్నాయి. నా కంటే ముందు అమెరికాకు అధ్యక్షులుగా ఉన్నవారు ఇరాన్ విషయంలో మెతకగా వ్యవహరించడంతో ఆ దేశంతో సమస్యలు పదేపదే వస్తున్నాయి. ప్రతి పదేండ్లకోసారి యుద్ధం జరుగుతున్నది. ఏదో ఒక చిన్న ఒప్పందం చేసుకుని వదిలేయడం వల్ల కొన్నేండ్ల తర్వాత మళ్లీ అమెరికాపై ఇరాన్‌‌‌‌ దాడి చేస్తున్నది. ఇలా ప్రతి పదేండ్లకు ఒకసారి అమెరికా మళ్లీ వెనక్కి వెళ్లి అదే పాత సమస్యపై పోరాడాల్సిన అవసరం లేకుండా చేయాలి. ఇరాన్ న్యూక్లియర్ తయారీపై ఒప్పందం జరగాలి. నేను అధ్యక్షుడిగా ఉండగా ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండటం నాకు ఇష్టం లేదు. అలాగని ఐదేండ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు మారగానే మళ్లీ యుద్ధాన్ని చేయాల్సి రావడం లేదా అంతకంటే దారుణమైన పరిస్థితులు చూడటం కూడా ఇష్టం లేదు. మాకు ఆమోదయోగ్యమైన వ్యక్తి సుప్రీంగా ఉంటేనే సమస్య పరిష్కారమవుతుంది. ఇరాన్ లొంగిపోకపోతే  మరింత భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ట్రంప్ హెచ్చరించారు.