ఇండియాతో ట్రేడ్ డీల్కు చేరువయ్యాం: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన

ఇండియాతో ట్రేడ్ డీల్కు చేరువయ్యాం: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన
  • చైనా, యూకేతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం
  • డీల్ కుదుర్చుకోని దేశాలకు లేఖలు పంపామని వెల్లడి

వాషింగ్టన్: ఇండియాతో ట్రేడ్ డీల్ కు చేరువయ్యామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘మేం బ్రిటన్, చైనాతో డీల్ కుదుర్చుకున్నాం. ఇండియాతో డీల్ కుదుర్చుకునేందుకు దగ్గరయ్యాం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశంలేదని భావించిన దేశాలకు ప్రతీకార సుంకాలు ఎంత శాతం విధిస్తామన్నది తెలియజేస్తూ లేఖలు పంపాం” అని ఆయన వెల్లడించారు. సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వైట్ హౌస్​లో డిన్నర్ ఇవ్వడానికి ముందుగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. కొన్ని దేశాలు ఏకంగా 200 శాతం టారిఫ్​లు విధిస్తూ అమెరికాను పీల్చి పిప్పి చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధిక టారిఫ్​ల వల్ల ఆయా దేశాల్లో తాము వ్యాపారం చేసేందుకు వీల్లేకుండా పోతోందన్నారు. కాగా, ఇండియా సహా వివిధ దేశాలపై ట్రంప్ ఏప్రిల్ 2న ప్రతీకార సుంకాలు ప్రకటించగా.. ఈ నెల 9 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. ఇండియా, తదితర దేశాలతో డీల్ కు మరింత సమయం ఇస్తూ.. గడువును ఆగస్టు 1 వరకూ అమెరికా పొడిగించింది. అయితే, డెడ్ లైన్ల ఆధారంగా అమెరికాతో ఎలాంటి ట్రేడ్ డీల్ ప్రతిపాదనలను తాము అంగీకరించలేదని భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇదివరకే స్పష్టం చేశారు.  

ఇండియా, పాక్ యుద్ధంపై మళ్లీ కామెంట్స్..
ఇండియా, పాకిస్తాన్​ మధ్య భారీ యుద్ధాన్ని ఆపానని ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. ‘‘ఇటీవలి కాలంలో నేను ఎన్నో యుద్ధాలు ఆపాను. ఇండియా– పాక్, సెర్బియా– కొసావో, రువాండా–కాంగో వంటి దేశాల మధ్య కొట్లాటలు ఆగేలా చూశాను. వీటిలో ఇండియా– పాక్ యుద్ధాన్ని ఆపడమే పెద్ద విషయం. ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితి రాకుండా చూశా. యుద్ధం కొనసాగిస్తే వాణిజ్యం చేయబోమని చెప్పి రాజీకి వచ్చేలా చేశా” అని ఆయన అన్నారు. 

మరో 12 దేశాలకు టారిఫ్ లేఖలు 
జపాన్, సౌత్ కొరియా దేశాలతోపాటు మరో 12 దేశాలకు ట్రంప్ సంతకం చేసిన టారిఫ్ లెటర్లను అమెరికా సోమవారం పంపింది. టారిఫ్ లేఖలు అందుకున్న దేశాల్లో బంగ్లాదేశ్, లావోస్, బోస్నియా, కంబోడియా, ఇండోనేషియా, కజకిస్తాన్, మయన్మార్, మలేసియా, సెర్బియా, సౌతాఫ్రికా, థాయ్​లాండ్, టునీషియా, తదితర  దేశాలు ఉన్నాయి. వీటిలో ఆయా దేశాలకు 25% నుంచి 40% వరకూ టారిఫ్ లు విధించనున్నట్టు ట్రంప్ వెల్లడించారు.   

ఉక్రెయిన్కు మరిన్ని వెపన్స్ పంపుతాం
రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలను పంపుతామని ట్రంప్ సోమవారం ప్రకటించారు. ‘‘వాళ్లపై ఇప్పుడు దాడులు భారీగా పెరిగాయి. ఉక్రెయిన్ వద్ద ఆయుధ నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని తెలుస్తోంది. అందుకే మేం వారికి ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, ప్రెషిషన్ గైడెడ్ ఆర్టిలరీ వంటి ఇతర ఆయుధాలను పంపుతున్నాం” అని ట్రంప్​ వివరించారు.