- ప్రపంచ రక్షణ కోసం ఓ ఐసు ముక్కను అడుగుతున్న
- సైన్యాన్ని ప్రయోగించాలని అనుకోవట్లేదు
- చర్చలతోనే స్వాధీనం చేస్కోవాలని చూస్తున్న
- డెన్మార్క్ ఎస్ అంటే సరే.. లేదంటే గుర్తుపెట్టుకుంటం
- దావోస్ వేదికగా అమెరికా ప్రెసిడెంట్ బెదిరింపులు
- యూరప్ సరైన మార్గంలో నడవట్లేదు.. నన్ను చూసి నేర్చుకోవాలని సూచన
దావోస్ (స్విట్జర్లాండ్): ‘‘గ్రీన్లాండ్ ను అమెరికాలో కలిపేసుకోవడంలో మరో ఆలోచన లేదు.. అమెరికా సైన్యం తల్చుకుంటే అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. అయినా సరే, నేను సైన్యాన్ని ప్రయోగించదలచుకోలేదు, ప్రయోగించను. చర్చల తోనే గ్రీన్లాండ్ ను తీసుకోవాలని భావిస్తున్నాం. మీరు అవునంటే సరే.. కాదంటే మాత్రం గుర్తుపెట్టుకుంటాం” అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ వేదికగా డెన్మార్క్ సహా యురోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలను హెచ్చరించారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమిట్ లో ట్రంప్ బెదిరింపులకు దిగారు. గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకునే విషయంలో వెనక్కు తగ్గేదే లేదని తేల్చిచెప్పారు. సుమారు 70 నిమిషాల పాటు మాట్లాడిన ట్రంప్.. యూరప్ ఖండం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. అయితే, ప్రస్తుతం యూరప్ సరైన దారిలో వెళ్లడంలేదని విమర్శించారు.
తన పాలనలో అమెరికన్లు సంతోషంగా ఉన్నారని, ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని చెప్పారు. తన పాలనను చూసి నేర్చుకోవాలని యూరప్ దేశాలకు హితవు పలికారు. రెండేండ్ల క్రితం మందకొడిగా సాగిన అమెరికా ఆర్థిక వ్యవస్థ తాను పగ్గాలు చేపట్టాక పరుగందుకుందని చెప్పారు. గతంలో అమెరికా కోల్పోయిన సంపదను తిరిగి రాబట్టుకోవడానికే విదేశాలపై టారిఫ్‌లు విధిస్తున్నానని సమర్థించుకున్నారు. ప్రస్తుతం అమెరికా నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయని వివరించారు.
ఎంతో మంది మిత్రులు.. కొందరు శత్రువులు..
దావోస్ వేదికగా ఎంతోమంది వ్యాపారవేత్తలు, చాలామంది మిత్రులు, కొంతమంది శత్రువులను కలుసుకోవడం సంతోషంగా ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. యూరప్ దేశాలకు పాలనపై సలహాలిస్తూ గ్రీన్లాండ్ అంశాన్ని ప్రస్తావించారు. గ్రీన్లాండ్.. నిజానికి ఇదొక దేశం కాదు. అమెరికా, రష్యా, చైనాల మధ్య ఉన్న ఓ భారీ ఐసు ముక్క. నార్త్ అమెరికాలో భాగమని చెప్పారు. దానిని తిరిగి తీసుకోవాలని ఇప్పుడు భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో గ్రీన్ లాండ్ ను కాపాడి డెన్మార్క్ కు తిరిగి అప్పగించామని గుర్తుచేశారు. కేవలం ఆరు గంటల పోరాటం తర్వాత జర్మనీకి డెన్మార్క్ లొంగిపోయిందని, తాము కల్పించుకుని డెన్మార్క్ తరఫున యుద్ధం చేశామని చెప్పారు. దీనికోసం అమెరికా ఎన్నో త్యాగాలు చేసిందని, సైనికులను, ఆయుధాలను, డబ్బును వెచ్చించిందని ట్రంప్ తెలిపారు. డెన్మార్క్ తో పాటు తమ కోసం తాము యుద్ధం చేశామని, అమెరికా అర్ధగోళంలో తమ శత్రువులు అడుగుపెట్టకుండా కాపాడుకున్నామని ట్రంప్ చెప్పారు.
ఎంతో కష్టపడి గ్రీన్లాండ్ ను రక్షించి తెలివితక్కువగా మళ్లీ డెన్మార్క్ కే అప్పగించామని చెప్పారు. దీనికి వారి (డెన్మార్క్) నుంచి మేం కృతజ్ఞత ఆశిస్తే.. ఇప్పుడు వారు కృతఘ్నత చూపిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. అప్పుడు మేం కల్పించుకోకుంటే, ఇప్పుడు మీరు (డెన్మార్క్ వాసులు) జర్మనీలో మాట్లాడుతుండే వారని ట్రంప్ సెటైర్ వేశారు.
ఆ వనరులపై ఆసక్తిలేదు..
గ్రీన్ లాండ్ మాక్కావాలని తాను చెప్పగానే ఎంతోమంది తనపై నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. అక్కడి ఖనిజ వనరులు తమకు ఎంతమాత్రం ముఖ్యం కాదని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్, డెన్మార్క్ వాసులంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. అయితే, ఆ భూభాగాన్ని అమెరికా తప్ప ప్రపంచంలో ఏ దేశమూ, ఏ కూటమి కూడా కాపాడలేదని ట్రంప్ చెప్పారు. అమెరికా శక్తిమంతమైన దేశమని మీకందరికీ తెలుసు.. కానీ మీరు ఊహించినదానికన్నా మా దేశం బలవంతమైనదని చెప్పారు.
మా సైన్యం తల్చుకుంటే గ్రీన్లాండ్ ను ఆక్రమించుకోకుండా తమను అడ్డుకునే శక్తి ఏదీ లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, తాను బలప్రయోగం చేయదలచు కోలేదని, చేయబోనని స్పష్టం చేశారు. గతంలో అమెరికాతో పాటు ఈయూ దేశాలు.. ప్రపంచం లో చాలా ప్రాంతాలను బలవంతం గా స్వాధీనం చేసుకున్నాయని గుర్తుచేశారు. ఇందులో తప్పేమీ లేదని చెబుతూ.. గ్రీన్లాండ్ విషయం మాత్రం వాటన్నింటికీ భిన్నమని, కేవలం రక్షణ కోసమే తీసుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ప్రపంచాన్ని కాపాడేందు కు ఓ ఐసుముక్కను అడుగుతుంటే వారు (డెన్మార్క్ నేతలు) నిరాకరిస్తున్నారని చెప్పారు.
