ట్రంప్ నోట పూటకో మాట.. యుద్ధం నుంచి విరమణ దాకా ఎప్పుడేం మాట్లాడారో చూడండి..!

ట్రంప్ నోట పూటకో మాట.. యుద్ధం నుంచి విరమణ దాకా ఎప్పుడేం మాట్లాడారో చూడండి..!

వాషింగ్టన్: ఇరాన్‎తో యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. ఉదయం యుద్ధం అంటే.. సాయంత్రానికి శాంతి అంటూ పశ్చిమాసియాలో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి, నాటో కూటమి విషయంలో ఆయన మాట మార్చిన తీరు దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.

హార్మూజ్ ను తెరిచేందుకు ఇరాన్‎కు గడువు విధిస్తూ.. ఆ గడువు సమీపిస్తున్న వేళ మళ్లీ పొడిగించడం ట్రంప్‎కు అలవాటుగా మారింది. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో అటు ఓటర్లను ఆకట్టుకోవడానికి, ఇటు చమురు ధరలను నియంత్రించడానికి ట్రంప్ ఇలాంటి పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్ మాటల వెనుక అసలు కారణాలు

ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించిన ప్రతిసారీ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 100 డాలర్ల మార్కును దాటుతున్నాయి. దీనివల్ల అమెరికాలో గ్యాసోలిన్ ధరలు పెరిగి ఓటర్లలో అసంతృప్తి వస్తుందని ట్రంప్ వెనక్కి తగ్గుతున్నారు. ఇరాన్ పట్ల కఠినంగా ఉన్నప్పటికీ, పాకిస్తాన్ మరియు ఒమన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించినప్పుడు ట్రంప్ వెంటనే తన నిర్ణయాలను మార్చుకుంటున్నారు. ఇరాన్ ఎదురుదాడిలో అమెరికా ఫైటర్​ జెట్లు కూలిపోవడం, సైనికులు గాయపడటం వంటి వార్తలు రాగానే ట్రంప్ తన దూకుడు తగ్గించి శాంతి మంత్రం జపిస్తున్నారు.

ట్రంప్ ఎప్పుడేం మాట్లాడారంటే..

ఫిబ్రవరి 28: చర్చలు పక్కన పెట్టి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్​పై దాడులు.
మార్చి 20: ‘హార్మూజ్ మూసేస్తే ఇరాన్  ఇంధన కేంద్రాలను పేల్చేస్తం’ అని వార్నింగ్​.
మార్చి 21: ఇరాన్‌‌కు 48 గంటల డెడ్‌‌లైన్ ఇచ్చి.. మరుసటి రోజే ఏప్రిల్ 6 వరకు పొడిగింపు.
మార్చి 26: చమురు ధరలు పెరగడంతో ‘మాకు ఆ జలసంధి అవసరం లేదు, మా దగ్గరే బోలెడు చమురు ఉంది’ అంటూ వ్యాఖ్యలు.
మార్చి 31: మిత్రదేశాలను ఉద్దేశించి ‘మీ చమురు నౌకల బాధ్యత మీరే చూసుకోండి, మాకు సంబంధం లేదు’ అని ప్రకటన.
ఏప్రిల్ 7: మళ్లీ స్వరం మార్చి, జలసంధి తెరవకపోతే ‘ఇరాన్ నాగరికతనే అంతం చేస్తా’ అని బెదిరింపులు.. ఆపై 2 గంటల్లోనే రెండు వారాల కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్.