వాషింగ్టన్/బెర్లిన్: అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. నాటో కూటమిలో కీలక భాగస్వామి అయిన జర్మనీ నుంచి 5 వేల మంది సైనికులను ఉపసంహరించుకుంటున్నట్టు అమెరికా రక్షణ కార్యాలయం (పెంటగాన్) అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరును యూరోప్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలో ట్రంప్ తాజా నిర్ణయం అమెరికా, యూరోప్ దేశాల మధ్య పెరుగుతున్న దూరాన్ని స్పష్టం చేస్తున్నది.
ప్రస్తుతం జర్మనీలో 35 వేల మంది అమెరికా సైనికులు ఉండగా, అందులో 5,000 మందిని తగ్గించనున్నారు. దీంతో యూరోప్‌లో అమెరికా సైనిక బలగాలు తిరిగి 2022 నాటి స్థాయికి (ఉక్రెయిన్ యుద్ధానికి ముందున్న స్థితికి) చేరుకుంటాయి. అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలపై కఠినంగా ఉండాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పెయిన్‌ను నాటో నుంచి సస్పెండ్ చేయడం, బ్రిటన్‌కు చెందిన ఫాక్లాండ్ దీవులపై పునరాలోచన.. తదితర ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
నాటోపై ట్రంప్ నిప్పులు
నాటో సభ్యదేశాల వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో మిత్రదేశాల నుంచి ఆశించిన మద్దతు లభించడంలేదని ఆయన ఆరోపించారు. ‘‘నాటో రక్షణ కోసం అమెరికా దశాబ్దాలుగా ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తోంది. కానీ అవసరం వచ్చినప్పుడు మాకు ఆ దేశాల నుంచి ‘సున్నా’ మద్దతు లభిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. అమెరికాకు సహకరించని దేశాలపై ఆర్థిక, సైనికపరమైన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.
ముందే ఊహించాం: జర్మనీ
అమెరికా బలగాల తగ్గింపును ముందే ఊహించామని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ అన్నారు. ‘‘యూరోప్ దేశాలు ఇకపై తమ భద్రత విషయంలో మరింత బాధ్యత వహించాలి” అని పేర్కొన్నారు.
