ఆర్టీసీయే అజెండాగా రేపు కేబినెట్ సమావేశం

ఆర్టీసీయే అజెండాగా రేపు కేబినెట్ సమావేశం

ఆర్టీసీయే అజెండాగా రేపు కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భేటీలో ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఆర్టీసీ అఫిడవిట్ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంపైనా కేబినెట్ లో చర్చించే ఛాన్స్ ఉంది.

రాష్ట్ట్ర కేబినెట్ రేపు సమావేశం అవుతోంది. 30 అంశాలతో ఏజెండా తయారైనా, ఇందులో ఆర్టీసీ పైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఆర్టీసీని విభజించడంపై మంత్రులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. హైదరాబాద్ లో గ్రేటర్ ప్రజా రవాణ వ్యవస్థ, జిల్లాలు, కార్పొరేషన్ స్థాయిలో పట్టణ ప్రజా రవాణా  వ్యవస్థ, గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయనున్నట్లు సమాచారం.

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. వీటి సంఖ్యను 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 20 శాతం రూట్లను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించాలని డిసైడైంది. ఈ నిర్ణయాలకు కేబినెట్ కు ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. అలాగే ఇవాళ ఆర్టీసీ దాఖలు చేసిన అఫిడవిట్ పై  హైకోర్టు వ్యక్తం చేసిన అసంతృప్తి కూడా కేబినెట్ భేటీలో చర్చించవచ్చు.

ఆర్టీసీ సమ్మె తో పాటు మరి కొన్ని అంశాల పై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. గాంధీ 150వ జయంతి సందర్భంగా 10 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష, భాషా పండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ లు, అన్ని జిల్లాల్లో, పోలీస్ కమిషనరేట్లలో ఫింగర్ ప్రింట్ అనాలసిస్ యూనిట్ల ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, పలు కోర్టుల్లో పోస్టుల మంజూరు, సమాచార పౌర సంబంధాల శాఖలో 36 పోస్టుల మంజూరు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో కొత్త పోస్టులకు అనుమతి వంటి అంశాలు ఏజెండాలో ఉన్నాయి.