కాళేళ్వరంపై విచారణ రిటైర్డ్ జడ్జితోనా.. సీవీసీతోనా?

కాళేళ్వరంపై విచారణ రిటైర్డ్ జడ్జితోనా.. సీవీసీతోనా?
  • సమాలోచనలు చేస్తున్నరాష్ట్ర ప్రభుత్వం
  • జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు సాధ్యం కాదని అంచనా
  • మాజీ సీఎం, ఓ మంత్రి సహా 33 మంది అధికారులపై విచారణ జరిపించాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలా లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కి ఆ బాధ్యత అప్పగించాలా అనిప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరంలో అక్రమాలపై సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా సిట్టింగ్ జడ్జితోనే విచారణకు మొగ్గు చూపింది. సీఎం రేవంత్ శాసన మండలి లో ఇదే విషయం ప్రకటించారు. అయితే సాంకేతిక అంశాలు ఇందుకు అడ్డంకిగా ఉన్నట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే అంశాలతో పాటు దేశ ప్రయోజనాలకు సంబంధించిన వివాదాలు తలెత్తితేనే సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించాలని సుప్రీం కోర్టు 2002లో ఆదేశాలు ఇచ్చింది. ఇదే తీర్పు కాళేశ్వరం పై సిట్టింగ్ జడ్జితో విచారణకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టు సీజేకు లేఖ రాయాలని నిర్ణయించారు. 

ఇందుకు హైకోర్టు సీజే అంగీకరించక పోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.  ఒకవేళ సిట్టింగ్ జడ్జితో విచారణకు సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో విచారణ జరిపించడమే మంచిదనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు 33 మంది అధికారులపై విచారణ జరిపించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అధికారుల్లో ఇరిగేషన్ సెక్రటరీలుగా పని చేసిన ఐఏఎస్ లతో పాటు ఈఎన్సీ స్థాయి నుంచి ఫీల్డ్ ఇంజనీర్ల వరకు ఉన్నారని ప్రభుత్వ వర్గాల సమాచారం.