65 ఏండ్లు నిండినా పెన్షన్ ఇయ్యట్లే

65 ఏండ్లు నిండినా పెన్షన్ ఇయ్యట్లే
  • భరోసా లేని ‘ఆసరా’
  • ‘57 ఏండ్ల’ హామీ అమలైతలేదు..
  • ఆఫీసులు, లీడర్ల చుట్టూ లబిధ్దారుల ప్రదక్షిణలు
  • 15 లక్షల మంది ఎదురుచూపులు
  • గత బడ్జెట్లో మాటిచ్చి అమలు చేయని సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: ఆసరా పెన్షన్ స్కీమ్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే  పరిమితమైంది. ఇచ్చిన హామీని అమలు చేయట్లేదు. అదే సమయంలో ఆర్హులైన వృద్దులకూ పెన్షన్ ఇవ్వట్లేదు. దీంతో లక్షలాది మంది లబ్ధిదారులు పెన్షన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టుకున్నా.. ప్రయోజనం ఉండట్లేదు. దీంతో పెన్షన్ కోసం వృద్ధులు.. ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కనిపించిన ఆఫీసర్లు, లీడర్లకు దండాలు పెడ్తూ పెన్షన్ ఇప్పించమని వేడుకుంటున్నారు. ఆసరా పెన్షన్ విషయంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. గత బడ్జెట్ లో కేవలం కేటాయింపులకే పరిమితం చేశారు. 2021–-22 బడ్జెట్ లోనైనా ఆసరా పెన్షన్ దారుల ఆశలు ఫలిస్తాయా లేదా అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.
రెండున్నరేళ్లుగా అటకెక్కిన హామీ
2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్ వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది. కొత్త లబ్ధిదారులకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారని పర్యటనలకు వెళ్లినప్పుడు లీడర్లకు ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో కేసీఆర్  2020–-21 బడ్జెట్ సమావేశాల్లో  కొత్త లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తామని  ప్రకటించారు. ఇందుకోసం నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. కానీ గత ఏడాది నుంచి ఆసరా పెన్షన్ కు కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. 
అప్లికేషన్లు తీసుకుంటున్రు.. పెన్షన్ ఇయ్యట్లే..
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 65 ఏండ్లు నిండినవారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. వెంటనే ఆసరా పెన్షన్ మంజూరు చేసేవారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అనే నిబంధనతో గ్రామంలో ఎంత మంది అర్హులు ఉంటే అంత మందికి శాంక్షన్ చేసేవారు.  2019 ఎన్నికల తర్వాత 65 ఏండ్లు నిండిన వృద్ధులకు పెన్షన్ ఇవ్వట్లేదు. రెండేళ్లుగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారే తప్ప.. పెన్షన్ ఇవ్వట్లేదు. గతంలో గ్రామంలో పెన్షన్ తీసుకుంటోన్న లబ్దిదారుడు చనిపోతే.. కొత్త వారికి పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చనిపోయిన వారి స్థానంలో తమకు పెన్షన్ ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తోన్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. 
4.5 లక్షల అప్లికేషన్లు పెండింగ్
ఆసరా పెన్షన్ కోసం దాదాపు 15 లక్షల మంది ఎదురుచూస్తున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నరు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన లబ్ధిదారుల వివరాలను సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10.5 లక్షల మంది ఉన్నట్టు అంచనా వేసింది.  2019 నుంచి ఇప్పటి వరకు 65 ఏండ్లు నిండిన వృద్ధుల నుంచి సుమారు 4.5 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. పై నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నందున.. కొంత కాలం పెండింగ్ లో పెట్టామని అంటున్నారు.  ‘ఈ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ మంజూరు చేయలేదు.  దుబ్బాక ఎన్నికల టైమ్‌లో  ఆ సెగ్మెంట్‌లో 2 వేల మందికి పెన్షన్ ఇచ్చాం’అని  ఓ సీనియర్ అధికారి తెలిపారు.
3 లక్షల మంది పెన్షన్ డబ్బులు ఖజానాలోకి
ప్రతి నెల ఆసరా పెన్షన్ తీసుకుంటోన్న వ్యక్తులు ఎందరు? ఎంతమంది తీసుకోలేదు? తీసుకోకపోతే కారణం ఏంటీ? అనే వివరాలను గ్రామల నుంచి ప్రభుత్వం సేకరిస్తోంది. అయితే  పెన్షన్ దారుల్లో మృతుల లెక్కలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. 2019 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది వృద్ధులు చనిపోయినట్టు అంచనా వేసింది. అయితే వీరికి ప్రతినెల ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులను ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుంటోంది. 

పింఛన్ వస్తలే.. 
నా వయసు 68 ఏండ్లు. ఆసరా పింఛన్‌‌ కోసం ఇప్పటికే అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు రాలే. ఇకపై కూడా వస్తదో రాదో తెలియడం లేదు. నా కంటే చిన్నవాళ్లకి పింఛన్‌‌ వస్తోంది. పింఛన్‌‌ కోసం ఆఫీసర్ల వద్దకు వెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయింది.‌‌‌‌-ఈశ్వరోజు నాగభూషణం చారి,రాఘయ్యపల్లి, మల్హర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా

రెండుసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా..
సీఎం కేసీఆర్ 58 ఏండ్లు నిండిన అందరికీ పెన్షన్ ఇస్తామంటే సంబుర పడ్డాం. రెండు సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా. ఇప్పటికీ పెన్షన్ రాలే. పంచాయతీకి పలుమార్లు వెళ్లినా.. ఇంకా శాంక్షన్ కాలేదని చెబుతున్రు. ఏం చేయాలో తెలియడం లేదు.- నవతే విఠల్, మల్లాపూర్ 

సారూ.. పింఛన్ ఎప్పుడొస్తది..
ఆసరా పింఛను కోసం దరఖాస్తు చేసి మూడేళ్లైంది. ఇంతవరకూ రాలే. రోజూ కూలీకి పోతున్న. కూలీ లేకపోతే ఇల్లు ఎల్లట్లె. చేత కాకపోతే ఇంట్లోనే ఉంటున్న. నాకు 64 ఏండ్లు ఉన్నయ్. పని చెయ్యడానికి కూడా ఓపిక ఉండట్లే. పింఛన్ ఎప్పుడొస్తది సారూ...‌‌‌‌ - గుండ్ర నారాయణ రెడ్డి, మేళ్లచెరువు

మూడేళ్లుగా ఎదురుచూస్తున్న
నాకు 63 ఏండ్లు దాటినయి. మూడేండ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న. ఆర్నెల్లకోసారి ఆఫీసర్లకు దరఖాస్తు  ఇస్తూనే ఉన్నా. అయినా ఇంతవరకు పెన్షన్ రాలే. మా ఊళ్లో ఎవరైనా పెన్షన్ దారుడు చనిపోతే ఆ స్థానంలో భర్తీ చేస్తామని చెప్పారు. ఇద్దరు ముగ్గురు చనిపోయినా పెన్షన్ మంజూరు చేయలేదు. -గోపిశెట్టి సాంబయ్య, యడ్లబంజరు, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా

సర్కారు పట్టించుకోవాలె
రెండేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరిగినా పింఛన్ రావట్లేదు. నాకు 62 ఏండ్లు.తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నా. ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని పింఛన్ ఇవ్వాలని వేడుకుంటున్నా.- వీరబోయిన మైసయ్య,  తుంగతుర్తి.