భూములు తీసుకొని పరిహారం ఇస్తలే!

భూములు తీసుకొని పరిహారం ఇస్తలే!

అచ్చంపేట, వెలుగు: నాగర్​కర్నూల్​జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద నిర్మిస్తున్న నక్కల గండి- బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​లో అసైన్డ్​, లావుణ్య పట్టా భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి ఆగమైంది.  మొత్తం1,120 ఎకరాలకు ఇప్పటివరకు పైసా పరిహారం ఇవ్వని సర్కారు, ఆన్​లైన్​లో రైతుల పేర్లను ఏనాడో తొలగించింది. దీంతో అటు పరిహారం రాక ఇటు రైతుబంధు అందక నిర్వాసితులు అరిగోస పడుతున్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటూ వచ్చిన  భూములుపోయి, బయట ఉపాధి దొరక్క దినమొక గండంగా బతుకుతున్నారు. భూములు రైతుల పేరిట లేకపోవడంతో ఇప్పటికి 30 మంది రైతులు చనిపోయినా రైతు బీమా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిహారం ఇయ్యకుండానే పేర్లు తొలగించిన్రు

నల్గొండ జిల్లాకు సాగు నీరందించాలనే లక్ష్యంతో నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలం మన్నె వారిపల్లి వద్ద డిండి లిఫ్టు స్కీంలో భాగంగా ప్రభుత్వం నక్కల గండి-- బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్ నిర్మిస్తోంది. ఇందుకోసం మండలంలోని మన్నె వారిపల్లి, జోగ్యా తండా, కేశ్యా తండా, మార్లపాడు తండా, దేవ్లా తండాలకు చెందిన 1,600 మంది రైతుల నుంచి 2,689 ఎకరాలు ఆఫీసర్లు సేకరించారు. వీటిలో 1,120 ఎకరాల అసైన్డ్ , లావుణ్య పట్టా భూములు ఉన్నాయి. కేవలం పట్టా భూములకు మాత్రమే పరిహారం అందించిన ప్రభుత్వం అసైన్డ్ , లావుణ్య పట్టా భూములకు ఏడేండ్లుగా పరిహారం ఇవ్వలేదు. పైగా అత్యుత్సాహంతో పోడు భూములను, లావుణ్య పట్టా భూములను ఆన్​లైన్​నుంచి 2012లోనే తొలగించారు. దీంతో వీళ్లెవరికీ కొత్త పట్టాపాస్​బుక్​లు రాలేదు. ఆన్ లైన్​లో భూములు తొలగించడంతో  రైతులెవరికీ  రైతు బంధు రావడం లేదు.  ఆయా గ్రామాల్లో ఈ ఏడేండ్లలో సుమారు 30 మంది వరకు రైతులు చని పోయినా వారి కుటుంబాలకు రైతు బీమా సొమ్ము అందలేదు. మరోవైపు గ్రామాల్లో చదువుకున్న యువత ఉపాధి పొందేందుకు బ్యాంకు లోన్ల కోసం పోతే  ముంపు గ్రామం కాబట్టి రుణాలు ఇవ్వలేమని ఆఫీసర్లు చెబుతున్నారు.

భూములకు బదులు భూములు ఇయ్యాలె..

తాము నిరుపేద రైతులమని, భూమిలేని తమకు గత ప్రభుత్వాలు భూములు కేటాయిస్తే టీఆర్ఎస్​ సర్కారు ప్రాజెక్టు పేరిట వాటిని గుంజుకొని తమ బతుకులను ఆగం చేసిందని నిర్వాసితులు అంటున్నారు. ఏడేండ్లుగా పరిహారం కోసం తిప్పించుకుంటున్నారని, ఒకవేళ పరిహారం ఇచ్చినా ఎకరం పైసలతో ఎక్కడా పది గుంటలు కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పరిహారం కాకుండా తీసుకున్న భూమికి బదులు వేరేచోట భూమి సేకరించి ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు. అలాగే ఆర్అండ్​ఆర్​ ప్యాకేజీ కింద  కుటుంబానికి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 2021 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు కూడా పరిహారం ఇవ్వాలంటున్నారు. పరిహారం ఇవ్వకుండానే ఇప్పుడు గ్రామాల్లోంచి తమను ఖాళీ చేయించాలని చూస్తున్నారని, అసైన్డ్​ భూములకు పరిహారం ఇవ్వడంతో పాటు, ఆర్అండ్ఆర్​ప్యాకేజీ పెంచి ఇచ్చేవరకు గ్రామాలను విడిచి వెళ్లే ప్రసక్తే లేదని చెబుతున్నారు. కాగా, ఆఫీసర్లు మాత్రం కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం ఆవాస్ యోజన కింద రూ. 6.36 లక్షలతో ఇంటినిగాని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 5.04 లక్షలతో కట్టి ఇచ్చే డబుల్​ బెడ్​రూం ఇంటిని గానీ ఇస్తామని, ఏదో ఒకటి ఎంపిక చేసుకొని గ్రామాలను ఖాళీ చేయాలని అంటున్నారు. దీనికి నిర్వాసితులు ఒప్పుకోవడం లేదు. 

ఆన్​లైన్​లో తొలగించిన్రు

 మా నాన్న టిక్​రాం, అమ్మ సుక్కి చనిపోయారు. వారి పేరుపై 3 ఎకరాల అసైన్డ్, లావుణ్య పట్టా భూములు ఉన్నాయి. అధికారులు పరిహారం ఇవ్వకుండానే ఆన్​లైన్​ నుంచి భూమి వివరాలు తొలగించడంతో మా కుటుంబం రైతుబంధు, రైతుబీమాకు దూరమైంది. – సబావట్​శివ, మార్లపాడు తండా

రైతు బీమా రాలే

మా తమ్ముడు మూడావత్ లాలుకు 3 ఎకరాల అసైన్డ్​ భూమి ఉంది. భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రెండేండ్ల క్రితం మా తమ్ముడు చనిపోయాడు. అధికారులు పరిహారం ఇవ్వకుండానే ఆన్​లైన్​లో పేరు తొలగించడంతో రైతు బీమా రాలేదు. అతని భార్య హైదరాబాద్​లో కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది...మూడావత్ శక్రు, మార్లపాడు తండా