తెలంగాణ ప్రభుత్వానికి , బీఆర్ఎస్కు షాక్... హైకోర్టు నోటీసులు జారీ

తెలంగాణ ప్రభుత్వానికి , బీఆర్ఎస్కు షాక్... హైకోర్టు నోటీసులు జారీ

తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు షాకిచ్చింది. నాలెడ్జ్ సెంటర్ (సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్) కోసం బీఆర్ఎస్కు  కోకాపేట్‌లో 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాధికారులకు, బీఆర్ఎస్కు  హైకోర్టు నోటీసులు జారీచేసింది.

బీఆర్ఎస్‌ కు  కోకాపేటలో 11 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ  కేటాయింపుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్  కార్యదర్శి ఎం పద్మనాభ రెడ్డి హైకోర్టులో పిల్  దాఖలు చేశారు. నాలెడ్జ్ సెంటర్ పేరు కేవలం ప్రభుత్వ కవర్ స్టోరీ అని.. బీఆర్‌ఎస్‌కు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడమే ఈ కేటాయింపు వెనుక అసలు ఉద్దేశమని పద్మనాభ రెడ్డి ఆరోపించారు. బంజారాహిల్స్ లో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ కార్యాలయం ఉందని.. ప్రజల సొమ్ముతో హైదరాబాద్‌లో మరో కార్యాలయం అవసరం లేదని పిల్‌లో పేర్కొన్నారు.

ఈ పిటీషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రూ. 50 కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కు కేవలం  రూ. 3.41 కోట్లకే కేటాయించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.  భూ కేటాయింపు డాక్యూమెంట్లను రహస్యం చేశారని అన్నారు. అయితే ఈ భూమిలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పేందుకు  కేటాయించామని ప్రభుత్వం పేర్కొంది. అయితే హైదరాబాద్‌లో మర్రి చెన్నా రెడ్డి హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ లాంటి సంస్థలు కూడా అదే ఉద్దేశ్యంతో ఉండగా కొత్త కేంద్రం అవసరమేంటని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు , తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 16కి వాయిదా వేసింది.

కోకాపేటలో బీఆర్ఎస్ కు  11 ఎకరాలు కేటాయిస్తూ.. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఆ స్థలాన్ని బీఆర్ఎస్ కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించిన జీవోను గోప్యంగా ఉంచింది. కోకాపేటలో ప్రస్తుతం మార్కెట్ ధర ఒక్కో ఎకరానికి సగటున రూ. 50 కోట్లు పలుకుతుంది. అయితే  ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ కు  ఎకరానికి రూ. 3.41 కోట్లకే కట్టబెట్టింది. ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని పార్టీ అవసరాల కోసం ఇవ్వడాన్ని ఫోరం తప్పుపట్టింది. దీనిపై హైదరాబాద్‌కు చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి హైకోర్టులో  ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.