అప్లికేషన్లలో నో క్యాస్ట్, నో రిలీజియన్ కాలమ్ పెట్టండి

అప్లికేషన్లలో నో క్యాస్ట్, నో రిలీజియన్ కాలమ్ పెట్టండి
  • కులం, మతం వద్దనుకునే హక్కుంది
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: బర్త్ సర్టిఫికెట్లలో కులం, మతం ప్రస్తావన వద్దు అని అనుకునేటోళ్ల కోసం.. అప్లికేషన్లలో కొత్తగా ‘నో క్యాస్ట్, నో రిలీజియన్’ కాలమ్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రజలకు కుల, మతపరమైన హక్కులు కల్పించిన రాజ్యాంగం.. ఆ కులం, మతం వద్దనుకునే హక్కు కూడా కల్పించిందని పేర్కొంది. హైదరాబాద్‌‌కు చెందిన సందేపాగు రూప, డేవిడ్‌‌ దంపతులు తమ కొడుకు ఇవాన్‌‌ రూడేకి కుల, మతరహిత సర్టిఫికెట్‌‌ ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే మున్సిపల్‌‌ ఆఫీసర్లు తిరస్కరించారు. దీన్ని సవాల్‌‌ చేస్తూ వారిద్దరూ 2019 ఆగస్టు 28న హైకోర్టులో పిల్‌‌ వేశారు. అయితే ఇది వ్యక్తిగత అంశమని హైకోర్టు చెప్పడంతో పిల్‌‌ను పిటిషన్ గా మార్చారు. దీనిపై జడ్జి జస్టిస్‌‌ కన్నెగంటి లలిత విచారణ చేపట్టి, బుధవారం కీలక తీర్పు ఇచ్చారు. 

‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌ 25 ప్రకారం ఒక వ్యక్తి తనకు నచ్చిన కులం, మతాన్ని నమ్మే స్వేచ్ఛ ఉంది. అదే విధంగా వాటిపై తనకు నమ్మకం లేదని చెప్పే స్వేచ్ఛ కూడా ఉంది. బర్త్ సర్టిఫికెట్లలో కులం, మతం వద్దు అని అనుకునేటోళ్లకు.. నో క్యాస్ట్, నో రిలీజియన్ సర్టిఫికెట్ కావాలని కోరుకునే హక్కు ఉంది. వాళ్ల దరఖాస్తులను స్వీకరించకపోతే, అది రాజ్యాంగ విరుద్ధమవుతుంది. కాబట్టి ఇలాంటి సర్టిఫికెట్లు కోరుకునే వారికోసం ప్రభుత్వం కొత్తగా అప్లికేషన్లలో నో క్యాస్ట్, నో రిలీజియన్ కాలమ్ చేర్చాలి. ఇందుకోసం మున్సిపల్, ఎడ్యుకేషన్, ఇతర శాఖలు చర్యలు తీసుకోవాలి” అని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేశారు.