అమితాబ్ పేరు తీసేయండి .. హైకోర్టు ఆదేశం

అమితాబ్ పేరు తీసేయండి .. హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: చిరంజీవి హీరోగా నటించిన సైరా సినిమా నిర్మాణంపై అభ్యంతరాలకు బాలీవుడ్ హీరో అమితాబ్‌ బచ్చన్‌కు సంబంధం ఏముందని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. సైరా నర్సింహారెడ్డి సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వరాదంటూ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వారసులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వారసులు దొరవారి దస్తగిరిరెడ్డి, మరో నలుగురు వేసిన రిట్‌లో అమితాబ్‌ బచ్చన్‌పై ఏ విధమైన అభ్యంతరాలు, ఆరోపణలు చేయలేదని హైకోర్టు గుర్తు చేసింది. అమితాబ్‌ను ప్రతివాదుల లిస్ట్‌ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఏపీలోని కర్నూలు జిల్లాలో నర్సింహారెడ్డి వారసులు 22 మంది ఉన్నారని, వారికి సినిమా ప్రివ్యూ చూపించిన తర్వాతే సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీ చేసేలా ఉత్తర్వులివ్వాలని నర్సింహారెడ్డి వారసుల తరఫు లాయర్ కోర్టును కోరారు. నర్సింహారెడ్డిని బ్రిటిష్ పాలకులు 1847 ఫిబ్రవరి 22న ఉరి తీశారని, ఎంతోమందిని స్వాతంత్య్ర పోరాట దిశగా చైతన్యం కల్పించినటువంటి ఆయన చరిత్రను.. యథాతథంగా చిత్రీకరించారో లేదో తేల్చాల్సింది వారసులేనని వాదించారు. సైరా తీస్తామని 2018 ఆగస్టు 2న సంప్రదించి, ఒప్పందం చేసుకుంటామని చెప్పిన నిర్మాత రామ్ చరణ్.. ఇంటికి పిలిపించి దారి ఖర్చులకు రూ.25 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని పిటిషనర్ల తరఫున వాదన వినిపించారు. చారిత్రక ఘటనల ఆధారంగా సినిమా తీసేందుకు ఎవరి అనుమతులు పొందాల్సిన అవసరం లేదని నిర్మాత రామ్‌చరణ్‌ తరఫు లాయర్‌ ఎస్‌.నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్ పై గురువారం విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.