ఇంటర్ పరీక్షల తేదీల్లో మళ్లీ మార్పు

ఇంటర్ పరీక్షల తేదీల్లో మళ్లీ మార్పు
  • జేఈఈ మెయిన్ షెడ్యూల్ మారడంతో నిర్ణయం!
  • పదో తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా మారే చాన్స్
  • రెండు, మూడు రోజుల్లో కొత్త తేదీల ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మరోసారి మారనున్నది. ఇప్పటికే మూడు సార్లు పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటించిన ఇంటర్ బోర్డు.. ఇంకోసారి కొత్త షెడ్యూల్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా జేఈఈ మెయిన్ ఫస్ట్ ఫేజ్ పరీక్షల డేట్లు మారడంతో, అనివార్యంగా తెలంగాణతోపాటు ఏపీలో ఎగ్జామ్స్ డేట్లు మారనున్నాయి. రెండు, మూడు రోజుల్లో కొత్త షెడ్యూల్ ను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా మారే అవకాశం ఉంది.

నాలుగోసారి..
మార్చి 23 నుంచి ఇంటర్ పరీక్షలు పెడతామని ఒకసారి, ఏప్రిల్ 20 నుంచి అని ఇంకోసారి, ఏప్రిల్ 22 అని మరోసారి ఇంటర్ బోర్డు షెడ్యూల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఏప్రిల్ 22 నుంచి మే 12 దాకా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నార్త్ ఇండియాలోని పలు రాష్ర్టాల్లో స్థానిక బోర్డు పరీక్షలు ఉండటంతో ఏప్రిల్ 16 నుంచి 21 దాకా జరగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను మారుస్తూ ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సోమవారం కొత్త షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం ఖరారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం పెడితేనే స్టూడెంట్లు ఎండల్లో పరీక్షలు ఎలా రాస్తారో అనే భయం ఆఫీసర్లలో ఉంది. మళ్లీ ఇప్పుడు మరో రెండు వారాలు వాయిదా వేయాల్సి వస్తే, ఎండల తీవ్రత అప్పటికి మరింత పెరిగే అవకాశముందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇంటర్‌‌ పరీక్షలకు దాదాపు 9.2 లక్షల మంది స్టూడెంట్లు అటెండ్ కానున్నారు. మరోపక్క మే 11 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలూ దాదాపు వాయిదా పడే అవకాశముంది.

రీషెడ్యూల్ చేయండి: మంత్రి
ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్ మార్పు నేపథ్యంలో అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సమీక్షించారు. విద్యా శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేనతో తేదీల మార్పుపై చర్చించారు. స్టూడెంట్ల భవిష్యత్ దృష్ట్యా ఇంటర్ షెడ్యూల్ మార్చాలని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఎవ్వరికీ ఇబ్బందులు లేకుండా రీషెడ్యూల్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లో పరీక్షల తేదీలపై క్లారిటీ రానున్నట్టు ఓ అధికారి చెప్పారు.

ఎన్‌టీఏపై విద్యాశాఖ సీరియస్.. త్వరలో లెటర్
జేఈఈ మెయిన్ తేదీల మార్పు విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. తొలుత మెయిన్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు కనీసం అభిప్రాయం తీసుకోలేదు. తాజాగా మార్పులు చేసిన సందర్భంలోనూ తెలంగాణ విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అభిప్రాయం తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు. కేవలం నార్త్ ఇండియాలోని పలు రాష్ర్టాల కోసం ఏపీ, తెలంగాణ స్టూడెంట్ల భవిష్యత్‌తో ఆడుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఘాటుగా ఎన్‌టీఏకు తెలంగాణ నుంచి లెటర్ రాసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.