ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం.. ఇందిరాపార్కు వద్ద మహాదీక్ష కార్యక్రమం

ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం.. ఇందిరాపార్కు వద్ద మహాదీక్ష కార్యక్రమం

హైదరాబాద్​, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17న ఇందిరాపార్కు వద్ద మహాదీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మహాదీక్ష కన్వీనర్​, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ దాసు సురేశ్​ తెలిపారు. మహాదీక్షకు ఆర్టీసీ కార్మికులు కుటుంబ సభ్యులతో హాజరై ప్రభుత్వం కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడారు. కార్మికుల డిమాండ్లలో ప్రధానమైన విలీనాన్ని తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు జేఏసీ నాయకులు ప్రకటించడాన్ని దళిత, బీసీ, మైనారిటీ ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయన్నారు.

సీఎం బెదిరింపులనూ లెక్కచేయకుండా కార్మికులు చేస్తున్న సమ్మెకు తూట్లు పొడిచేలా జేఏసీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 17న రాష్ట్రానికి వస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్​మాధవ్​ను కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఫిర్యాదు చేస్తామన్నారు. అమరులైన 28 మంది ఆర్టీసీ కార్మికుల్లో 26 మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన కార్మికులే ఉన్నారని అన్నారు. 49 వేల మంది ఆర్టీసీ కార్మికుల్లో 44 వేల మంది పేద, బలహీన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే ఉన్నారన్నారు.  మహాదీక్షకు బీసీ సంక్షేమం అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​, పలు పార్టీల నేతలు హాజరవుతారని దాసు సురేశ్​ తెలిపారు.