సెప్టెంబర్ 15న టెట్.. 8 భాషల్లో ఎగ్జామ్..

సెప్టెంబర్ 15న టెట్.. 8 భాషల్లో ఎగ్జామ్..
  • అదే నెల 27న రిజల్ట్స్.. ఇయ్యాల్టి నుంచి ఆన్​లైన్​లో అప్లికేషన్లు 
  • దరఖాస్తు ఫీజు రూ.400కు పెంపు.. నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ 

హైదరాబాద్, వెలుగు: 
తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్​టెట్–2023) నోటిఫికేషన్ ను విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 15న టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. కేవలం రెండు నెలల్లోనే టెట్ ప్రక్రియ ముగిసేలా షెడ్యూల్ తయారు చేసింది. బుధవారం నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

వచ్చే నెల 15న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. అదే నెల 27న ఫలితాలు రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న డీఈడీ, బీఈడీ స్టూడెంట్లు కూడా టెట్​ రాసేందుకు అర్హులని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. టెట్​నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను tstet.cgg.gov.in వెబ్​ సైట్​లో ఉంచారు. కాగా, మొత్తం 33 జిల్లాల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అభ్యర్థి తనకు నచ్చిన జిల్లాను ఎంచుకోవచ్చు. అయితే జిల్లాలో పరీక్ష రాసే అభ్యర్థుల సామర్థ్యానికి మించి అప్లై చేస్తే, పక్క జిల్లాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ముందుగా అప్లై చేస్తే.. అభ్యర్థులు తాము ఎంచుకున్న జిల్లాలో పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.

8 భాషల్లో ఎగ్జామ్.. 

పేపర్–1 (ఐదో తరగతి వరకు టీచర్), పేపర్–2 (ఆరు నుంచి 8వ తరగతి వరకు టీచర్) కు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. అయితే బీఈడీ చేసినోళ్లు రెండు పేపర్లు రాసేందుకు అర్హులని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. పేపర్ 1 అభ్యర్థులు టెన్త్ వరకు, పేపర్ 2 అభ్యర్థులు ఇంటర్ వరకు సిలబస్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ రెండు భాషల్లో ఉంటుంది. ఇంగ్లిష్​తో పాటు ఇతర 8 భాషల్లో ఏదైనా అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ నుంచి తమకు నచ్చిన భాషను అభ్యర్థులు ఎంచుకోవచ్చు. కాగా, టెట్ ఎగ్జామ్ ఫీజు మరోసారి పెంచారు. 2017లో రూ.200 ఉండగా, 2022లో రూ.300కు పెంచారు. ఇప్పుడు దాన్ని రూ.400 చేశారు. వరుసగా రెండేండ్లలో రూ.200 ఫీజు పెంచడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. పోటీ పరీక్షలకు టీఎస్​పీఎస్సీ కేవలం రూ.200 మాత్రమే ఫీజు తీసుకుంటుండగా, విద్యాశాఖ మాత్రం రూ.400 వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఈసారీ 20% వెయిటేజీ.. 

గతంలో మాదిరిగానే ఈసారీ టెట్ మార్కులకు వెయిటేజీ కల్పించారు. టెట్ నుంచి 20%, టీఆర్టీ ఎగ్జామ్ నుంచి 80% మార్కులతో ఫైనల్ గ్రేడ్స్/ ర్యాంకులు ఇస్తారు. రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల మంది బీఈడీ, 1.5 లక్షల మంది డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారు. 2017లో టీఆర్టీ నోటిఫికేషన్ సమయంలో ఎస్జీటీ పోస్టులకు 65వేల మంది డీఎడ్ అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 2 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రస్తుతం టెట్ వ్యాలిడిటీని లైఫ్​ టైమ్ చేయడంతో.. గతంలో క్వాలిఫై అయినోళ్లు ఎక్కువ మార్కులు స్కోర్ చేసేందుకు ఈసారి కూడా పరీక్ష రాసే అవకాశం ఉంది. కాగా, ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కానోళ్లు సుమారు 2 లక్షల మంది వరకు ఉంటారని అంచనా.