గ్రూప్ 3 సెలెక్షన్ లిస్టు రిలీజ్.. 1,370 మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ జాబితా

గ్రూప్ 3 సెలెక్షన్ లిస్టు రిలీజ్.. 1,370 మంది అభ్యర్థులతో  ప్రొవిజనల్ జాబితా

హైదరాబాద్, వెలుగు: గ్రూప్-3 అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. గ్రూప్-3 సర్వీసెస్ ప్రొవిజనల్ ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గురువారం రిలీజ్ చేశారు. అయితే, మొత్తం 1,388 పోస్టులకు గానూ.. 1,370 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్‌‌ను కమిషన్ ప్రకటించింది. ఒక పోస్టు ఫలితాన్ని మాత్రం విత్‌‌హెల్డ్‌‌లో పెట్టారు. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను https://www.tgpsc.gov.in వెబ్‌‌సైట్‌‌లో చూసుకోవచ్చని సూచించారు.  

కాగా, 2022 డిసెంబర్ లో గ్రూప్-3 నోటిఫికేషన్ రిలీజ్ చేయగా, 2024 నవంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,36,400 మంది అప్లై చేయగా.. 2,67,921 మంది పరీక్షలు రాశారు. ఈ ఏడాది మార్చి 14న వారిలో 2,49,557 మందికి జనరల్ ర్యాకింగ్ లిస్టులను రిలీజ్ చేశారు. మరో 18,364 మంది పేపర్లను ఇన్ వ్యాలిడ్ కింద ప్రకటించారు. ఆ ర్యాంకుల ఆధారంగానే తాజాగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌‌ను రెడీ చేసినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ ప్రియాంక ఆలా తెలిపారు. అయితే, కోర్టు కేసులకు లోబడి ఈ ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇచ్చినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు తేలినా ఎంపికను రద్దు చేస్తామని హెచ్చరించారు.