గ్రూప్ 1 రద్దుపై సుప్రీంకు టీఎస్​పీఎస్సీ!

గ్రూప్ 1 రద్దుపై సుప్రీంకు టీఎస్​పీఎస్సీ!

హైదరాబాద్, వెలుగు:  గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ టీఎస్ పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. ఓ సీనియర్ అడ్వకేట్ ద్వారా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. పిటిషన్ ఈ వారంలోనే లిస్టు కావొచ్చనీ అధికారిక వర్గాలు చెప్తున్నాయి. నెలరోజుల క్రితం గ్రూప్1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహణపై అభ్యంతరం తెలుపుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల వాదనలను సమర్థించిన హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసింది.

అప్పట్లో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు పోవాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రాంచంద్రన్ ఢిల్లీకి వెళ్లి, కేసు గురించి అడ్వకేట్లతో చర్చించారు. అయితే, సుప్రీంకోర్టు ఒకవేళ హైకోర్టు తీర్పును రద్దు చేస్తే.. ఈసీ పర్మిషన్ తీసుకొని వెంటనే ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయాలన్న యోచనలో కమిషన్ అధికారులున్నారు. అలాకాకుండా టీఎస్​పీఎస్సీకి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేయాలనే దానిపై కూడా కమిషన్​లో చర్చ నడుస్తోంది.