సిటీలో 700 బస్సులు కట్

సిటీలో 700 బస్సులు కట్
  • ఫాయిదా లేని రూట్లలో తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయం
  • 2 వేలకు తగ్గనున్న బస్సు సర్వీసులు
  • ఇప్పటికే బస్సులు సరిపోక నగరవాసుల ఇబ్బందులు
  • ఇక ‘ప్రైవేట్‌‌’లో తడిసి మోపెడు కానున్న చార్జీలు

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ సిటీలో ఇప్పటికే బస్సులు చాలక అష్టకష్టాలు పడుతున్న ప్రయాణికులకు మరిన్ని తిప్పలు రాబోతున్నాయి. నగరంలో మరో 700 బస్సులను బంద్​ పెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. దశలవారీగా మరికొన్నింటినీ తగ్గించే చాన్స్‌‌ ఉన్నట్లు తెలుస్తోంది. లాభాలు వస్తలేవనే సర్వీసులను తగ్గించనున్నట్లు సమాచారం. గత సమ్మె తర్వాత దాదాపు వెయ్యి బస్సుల దాకా పక్కనబెట్టారు. బస్సులు సరిపోక, ఉన్నవి టైమ్​కు రాక ఇప్పటికే నగరవాసులు పడరాని పాట్లు పడుతున్నారు. కొత్తగా మరికొన్ని బస్సులను పక్కనబెడితే ప్రైవేట్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌లో చార్జీలు తడిసి మోపెడు కానున్నాయి.

మరో వెయ్యి బస్సులు బంద్​ పెట్టే యోచన

గ్రేటర్‌‌ ఆర్టీసీ జోన్‌‌ పరిధిలో 29 డిపోలు ఉన్నాయి. 2019 ఆర్టీసీ సమ్మె కంటే ముందు 3700 బస్సులు నడిచేవి. లాభాలు రావడం లేదని, స్క్రాప్‌‌ బస్సులు ఉన్నాయని సుమారు 1000 సర్వీసులను తగ్గించారు. ప్రస్తుతం నగరంలో 2700 బస్సులు నడుస్తున్నాయి. ఇటీవల ప్రగతి భవన్‌‌లో సీఎం కేసీఆర్‌‌ ఆర్టీసీపై రివ్యూ నిర్వహించారు. అందులో సిటీలో లాభాలు రాని రూట్లలో బస్సులు తగ్గించాలని ఆదేశించినట్లు తెలిసింది. అందులో భాగంగా వెయ్యి బస్సులను పక్కనబెట్టే అవకాశం ఉంది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో బస్సులను బంద్‌‌ చేస్తే ఇబ్బంది అవుతుందని, మొదటి విడతగా 700 తగ్గించేందుకు అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. బస్సుల తగ్గింపునకు సంబంధించి ఉన్నతాధికారులు డిపోలకు ఇటీవల ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒక్కో డిపో నుంచి 15 నుంచి 30 బస్సులను తగ్గించే చాన్స్​ ఉంది. దీంతో 2019 డిసెంబర్‌‌లో 3700 బస్సులుండగా, ఇక నుంచి వాటి సంఖ్య 2 వేలకే పరిమితం కానుంది.

మెట్రోకు మేలు!

ఆర్టీసీ నష్టాల్లో పెద్దవాటా గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ నుంచే ఉంటోంది. ప్రస్తుతం ఆదాయం రూ. 2.5 కోట్లు ఉన్నా, నిర్వహణ ఖర్చు మాత్రం రూ. 3.5 కోట్లు అవుతోంది. దీంతో నష్టాలు వస్తున్నాయనే బస్సులను పక్కన బెట్టనున్నారు. మరోవైపు మెట్రోకు మేలు చేసేందుకు  కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఐటీ సెక్టార్‌‌లో వర్క్‌‌ ఫ్రం హోం చేయడం, ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌కు జనాలు ఇంట్రెస్ట్‌‌ చూపించకపోవడం తదితర కారణాలతో మెట్రోకు ఆదరణ తగ్గింది. ఇటీవల మెట్రోపై కూడా సీఎం కేసీఆర్‌‌ రివ్యూ నిర్వహించి, ఆదుకుంటామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఎక్సెస్ ​స్టాఫ్ ​ఏం చేస్తరు?

బస్సుల తగ్గింపుతో ఆర్టీసీలో స్టాఫ్‌‌ ఎక్సెస్‌‌ కానుంది. ఒక్కో బస్సుకు ఐదారుగురు సిబ్బందిని  ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు బస్సులను తగ్గిస్తే వారు ఖాళీగా ఉండనున్నారు. ఇప్పటికే వెయ్యి బస్సులు తగ్గించడంతో కొంత మందికి పనిలేకుండా పోయింది. వారిలో కొందరిని కార్గో సర్వీసులకు, మరికొంత మందిని బస్‌‌ పాయింట్ల వద్ద ట్రాఫిక్‌‌కు వాడుతున్నారు. అయితే గతంలో వెయ్యి బస్సులు తగ్గించినా ఆర్టీసీకి లాభాలు రాకపోగా, నష్టాలు తగ్గలేదని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి తప్పదని కొందరు అధికారులు అంటున్నారు.

నగరవాసులకు తిప్పలే..

ఆర్టీసీ బస్సులను చిరు ఉద్యోగులు, కిందిస్థాయి, మధ్యతరగతి ఎంప్లాయీస్‌‌ ఎక్కువగా ఆదరిస్తారు. వీరంతా తక్కువ జీతాలకు పనిచేసేవారే. ఇప్పటికే బస్సులు లేక, ఉన్నా సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్న అరకొర బస్సులను కూడా తగ్గిస్తే మరింత ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్​ ఉంది. వీరంతా క్యాబ్‌‌ల్లో, మెట్రోల్లో అధిక చార్జీలు పెట్టి ప్రయాణించలేని పరిస్థితి.