మహిళలకు ఫ్రీ జర్నీ... సంక్రాంతికి 4 వేల 484 స్పెషల్​ బస్సులు : సజ్జనార్

 మహిళలకు ఫ్రీ జర్నీ...  సంక్రాంతికి 4 వేల 484 స్పెషల్​ బస్సులు : సజ్జనార్

హైదరాబాద్, వెలుగు :  సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 7 నుంచి 15 వరకు 4,484 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఇందులో 626 బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. చార్జీల్లోనూ ఎలాంటి పెంపు ఉండదని, గతంలో మాదిరిగానే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. శుక్రవారం బస్ భవన్ లో సంక్రాంతి సర్వీసులు, మహాలక్ష్మి స్కీంపై ఈడీలు, ఆర్ఎంలతో ఎండీ రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. 

హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌‌‌‌, జేబీఎస్‌‌‌‌, ఉప్పల్‌‌‌‌ క్రాస్‌‌‌‌ రోడ్స్‌‌‌‌, ఆరాంఘర్‌‌‌‌, ఎల్బీనగర్‌‌‌‌ క్రాస్‌‌‌‌ రోడ్స్‌‌‌‌, కేపీహెచ్‌‌‌‌బీ, బోయిన్‌‌‌‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరు డీవీఎం ర్యాంక్ అధికారులను ఇన్​చార్జ్ లుగా నియమించామని, రద్దీకి అనుగుణంగా వారు ప్రత్యేక బస్సులను  అందుబాటులో ఉంచుతారని వివరించారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఎండీ చెప్పారు. షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. ఈ రివ్యూలో సీవోవో రవీందర్, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

సిబ్బందితో మమేకం కోసమే వనభోజనాలు..  

ఆర్టీసీ కార్మికులు, సిబ్బందితో మమేకం కావడం కోసమే డిపోల్లో వన భోజనాలు నిర్వహిస్తున్నామని ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని రాజేంద్ర నగర్ డిపో లో శుక్రవారం నిర్వహించిన వనభోజనాల కార్యక్రమానికి  ఎండీ అటెండ్ అయి మాట్లాడారు. సిబ్బందిని అప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిమందికి ఆయనే స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం సిబ్బందితో కలిసి భోజనం చేశారు. సంస్థకు ప్రయాణికులు, సిబ్బంది రెండు కండ్ల లాంటి వారని, పెండింగ్ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కరిస్తామని సర్కారు హామీ ఇచ్చిందని ఎండీ పేర్కొన్నారు.