
- సంక్రాంతికి కొత్త బస్సులు
- 200 బస్సులను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ
- కొత్త బస్సులను పరిశీలించిన సంస్థ ఎండీ సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో వచ్చే సంక్రాంతి పండుగ నాటికి 200 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకు రానుస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వీటిలో 50 బస్సులను వారంలోగా ప్రారంభిస్తామని చెప్పారు. శుక్రవారం బస్ భవన్‌లో రాజధాని, సూపర్ లగ్జరీ కొత్త బస్సులను సీవోవో రవీందర్, ఈడీ కృష్ణకాంత్‌లతో కలిసి సజ్జనార్ పరిశీలించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బస్సులు తయారు చేశారని ఆయన తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద -మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, దీంతో వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 5 నెలల్లో మొత్తం మరో 2 వేల కొత్త బస్సులు రానున్నాయని తెలిపారు. ఇందులో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, రాజధాని, హైదరాబాద్ సిటీ బస్సులు కూడా ఉన్నాయని చెప్పారు.
అద్దె బస్సులకు టెండర్లు..
గ్రేటర్ హైదరాబాద్‌లో నడిపేందుకు సిటీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ, సబ్ ఆర్బన్ బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించింది. రూట్లు, రోజు నడిపే కిలోమీటర్లు, అద్దె రేట్లు, డిపాజిట్ వంటి వివరాలు టెండర్ నోటిఫికేషన్‌లో ఉన్నాయని శుక్రవారం ఆర్టీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. టెండర్ పత్రాలను సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపింది.
డ్రైవర్ల డబుల్ డ్యూటీ వేతనం పెంపు..
డబుల్ డ్యూటీ చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల వేతనాన్ని పెంచుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో రెగ్యులర్ డ్రైవర్లకు గతంలో రూ.740 ఉండగా, ఇప్పుడు రూ.900కి పెంచారు. కండక్టర్లకు రూ.700 ఉండగా రూ.900కి పెంచారు. ఇతర జిల్లాల్లో డ్రైవర్లకు రూ.600 ఉండగా రూ.730, కండక్టర్లకు రూ.530 ఉండగా, రూ. 650కి పెంపు చేశారు. ఇక కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లకు సైతం పారితోషికాన్ని పెంచారు.