- ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ సిస్టం విధానంలో రూపకల్పన
- ఒకట్రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేలా ఆర్టీసీ కసరత్తు
- ఎస్డీఎఫ్ఫండ్రూ.5 కోట్లు ఆర్టీసీకి ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మారే కాలానికి అనుగుణంగా టీజీఎస్‌ఆర్టీసీ తన రూపురేఖలను సమూలంగా మార్చుకుంటోంది. కేవలం ప్రయాణానికే పరిమితం కాకుండా వ్యాపారం, వినోదం, ఇతర రవాణా వ్యవస్థల అనుసంధానంతో ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ సిస్టం విధానంలో ఆధునిక బస్టాండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్ల రూపురేఖలు మారనున్నాయి. దశాబ్దాల కింద నిర్మించిన ప్రస్తుత బస్టాండ్లను కూల్చివేసి వాటి స్థానంలో రూ.30 కోట్లతో కార్పొరేట్ లుక్‌లో మోడ్రన్ బస్టాండ్లను నిర్మించేందుకు ఆర్టీసీ ఆఫీసర్లు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే డిజైన్, ప్రతిపాదనలపై కసరత్తు పూర్తికాగా, త్వరలోనే టెండర్లను ఖరారు చేయనున్నారు.
హైటెక్ బస్టాండ్లు..
జిల్లాలో సుమారు 50 ఏండ్ల కింద నిర్మించిన కొత్తగూడెం బస్టాండ్, సుమారు 40 ఏండ్ల కింద నిర్మించిన పాల్వంచ బస్టాండ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. వానొస్తే బస్టాండ్లు కురవడం, పైకప్పు పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయోననే భయంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. బస్టాండ్ ఆవరణలో గుంతలు, కంకర తేలిపోవడంతో ప్రయాణికులతో పాటు డ్రైవర్లు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో పాల్వంచ బస్టాండ్ ఆవరణ చిన్నపాటి నీటి కుంటను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు బస్టాండ్ల పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం, ఆర్థిక, రవాణా శాఖల మంత్రులను కోరారు.
నియోజకవర్గాల అభివృద్ధి నిధుల్లో భాగంగా తనకు కేటాయించిన రూ.5 కోట్లను ఇటీవల ఆర్టీసీకి కేటాయిస్తూ ఎమ్మెల్యే ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అనంతరం బస్టాండ్ల నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించాలని సీఎం, రవాణా శాఖ మంత్రిని కోరారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న బస్టాండ్లను తొలగించి కొత్తగూడెం బస్టాండ్‌ను రూ.20 కోట్లు, పాల్వంచ బస్టాండ్‌ను రూ.10 కోట్లతో నిర్మించేందుకు ఆర్టీసీ ఆఫీసర్లు ప్రపోజల్స్ రూపొందించారు. అంచనాల తయారీకి అధికారులు శ్రీకారం చుట్టారు. కొత్తగూడెం బస్టాండ్‌ను జీ+1 తరహాలో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒకట్రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు.
వ్యాపారం, వినోదం, రవాణా అనుసంధానం..
కొత్తగూడెం బస్టాండ్‌ను ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ బస్టాండ్‌గా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. వ్యాపారం, వినోదం, ఇతర రవాణా వ్యవస్థలను అనుసంధానించే విధంగా ఈ బస్టాండ్‌ను నిర్మించనున్నారు. మల్టీప్లెక్స్ తరహా ఆధునిక హంగులతో బస్టాండ్‌ను తీర్చిదిద్దనున్నారు. బస్సు దిగిన వెంటనే రైల్వేతో పాటు ఇతర రవాణా సదుపాయాలను సులభంగా చేరుకునేలా కనెక్టివిటీ కల్పించనున్నారు. ఆర్టీసీకి ఆదాయ వనరులను పెంచేలా వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండే సమయంలో ఆహ్లాదకరంగా గడిపేలా ఫుడ్‌కోర్టులు, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు తదితర సదుపాయాలను అందుబాటులోకి తీసుకురాన్నారు.
