బస్సుల కోసం ఎదురు చూసే వారి వేదన అంతా ఇంతా కాదు. ఎప్పుడొస్తాయో తెలియక ఓపికలు నశిస్తున్నా వేచి చూడాల్సిన దుస్థితి ఉంటుంది. దీంతో బస్టాపుల్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది.
ఈ బాధలు తప్పించడానికే టీఎస్ఆర్టీసీ ఓ కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. మనం ట్రావెల్ చేయబోయే బస్సు ఎక్కడ ఉంది తదితర వివరాలన్నీ ఇకపై ఫోన్లోనే చూసుకోవచ్చు.ఆ వివరాల్లోకి వెళ్తే... ఆర్టీసీ యాజమాన్యం రూపొందించిన ఓ యాప్ ఇప్పుడు ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.
ఆ యాప్ ముఖ్య ఉద్దేశం వెహికిల్ ని ట్రాకింగ్చేయడం. కొన్ని రోజుల కింద ప్రయోగాత్మకంగా పరిశీలించిన వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని అధికారులు యోచిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్పరిధిలోని అన్ని బస్సులను జీపీఎస్ అనుసంధానించడం ద్వారా ఏ బస్సు ఎక్కడ ఉంది, అది ఎంత సమయంలో వస్తుంది తదితర వివరాలు ఈజీగా తెలిసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన టీఎస్‌ఆర్టీసీ వెహికిల్ ట్రాకింగ్ మొబైల్ యాప్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగస్టు 12న ఎంజీబీఎస్ లో ప్రారంభించనున్నారు.
నగరంలోని వివిధ మార్గాల్లో తిరిగే సుమారు 2 వేల 850 బస్సులతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మరో 2 వేల 500లకుపైగా బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
బస్సు కోసం విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా ఇంటి నుంచి బయల్దేరేటప్పుడే జర్నీని ప్లాన్ చేసుకోవచ్చన్నమాట. దీనికి తోడు అప్పటికే ఆ రూట్లలో నడుస్తున్న బస్సుల వివరాలూ యాప్లో ఉంటాయి.