ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య.. బండ్లగూడ డిపో వద్ద ఆందోళన

ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య..  బండ్లగూడ డిపో వద్ద ఆందోళన

మహిళా ఆర్టీసీ కండక్టర్ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మన్సురాబాద్ లోని డిపి నగర్ కు చెందిన గంజి శ్రీవిద్య (48) గత 12ఏళ్లుగా ఆర్టిసిలో కండక్టర్ గా పని చేస్తుంది ప్రస్తుతం నాగోల్ బండ్లగుడ డిపోలో పనిచేస్తుంది.కాగా ఈ నెల 12న శ్రీవిద్య కొన్ని గుర్తు తెలియని స్లీపింగ్ మెడిసిన్స్ వేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.చికిత్స పొందుతూ ఆమె సోమవారం సాయంత్రం మృతి చెందింది. దీంతో మృతురాలి కుమారుడు తన తల్లికి సస్పెన్షన్ లెటర్ ఇవ్వడంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

కండక్టర్  శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్టీసీ అధికారుల వేధింపులే కారణం అంటూ బండ్లగూడ డిపో ముందు పెద్ద ఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. శ్రీ విద్యను వేధించిన వారిని కఠినంగా శిక్షించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో బండ్లగూడ డిపో  వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ఆర్టీసి కార్మికుల ధర్నాతో డిపో వద్ద  బస్సు సేవలు నిలిచిపోయాయి.