రూ.5ల సబ్సిడీ భోజనాన్ని రూ.27కు పెంచిన టీటీడీ

రూ.5ల సబ్సిడీ భోజనాన్ని రూ.27కు పెంచిన టీటీడీ

ఎంప్లాయిస్ క్యాంటీన్లో ఉద్యోగులకు టిటిడి షాక్..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకు లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులకు ఉచిత భోజనం అందజేస్తుంది. కానీ, టీటీడీలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం సబ్సిడీపై ఇచ్చే ఐదు రూపాయల భోజనాన్ని 23, 27 రూపాయలకు పెంచుతూ షాక్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం నుండి తిరుమలలోని ఎంప్లాయిస్ క్యాంటీన్, తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఎంప్లాయిస్ క్యాంటీన్లలో ధరలను పెంచుతూ టీటీడీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల కొండపై ఉన్న టీటీడీ ఉద్యోగుల క్యాంటీన్లో రోజుకు 500 నుండి 1000 మంది ఉద్యోగులు, పరిపాలనా భవనంలోని ఎంప్లాయిస్ క్యాంటీన్లో రోజుకు రెండు వేల మంది ఉద్యోగులు ఐదు రూపాయల భోజనం చేస్తుంటారు. ప్రతిరోజు సాధారణ భోజనం కాకుండా వారంలో రెండురోజులు ప్రత్యేక భోజనాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల టీటీడీ ఉద్యోగులు అధికారులకు విన్నవించారు. వారంలో సోమవారం మరియు గురువారం ఆ సదుపాయం కల్పించాలని ఉద్యోగులు కోరారు. ఈ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న టీటీడీ అధికారులు.. ప్రతిపాదనను తయారుచేసి టీటీడీ పాలక మండలి ముందుంచారు.

దీనిపై చర్చించిన టీటీడీ పాలకమండలి.. ఉద్యోగులకు ఐదు రూపాయల సబ్సిడీపై భోజనాన్ని అందించడం సరికాదని, దీన్ని 23 రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. అంతేకాకుండా సోమవారం మరియు గురువారం అందించే ప్రత్యేక భోజనాన్ని 27 రూపాయలకు అందించాలని కమిటీ తీర్మానించింది. టీటీడీ పాలక మండలి తీర్మానం మేరకు తిరుమల తిరుపతిలోని టీటీడీ ఉద్యోగుల క్యాంటీన్లలో శుక్రవారం నుండి ఈ పెంచిన ధరలను అమలు చేస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా టీటీడీ ఉద్యోగుల పరిస్థితి తయారైంది. లక్షలాది మంది భక్తులకు ఉచిత భోజనం అందిస్తున్న టీటీడీ.. సొంత సంస్థల్లోని ఉద్యోగులకు సబ్సిడీ ధరలపై ఇస్తున్న భోజనానికి కోత విధించడంపై విమర్శలు వస్తున్నాయి. ధరలను పెంచడం ఏమాత్రం సమంజసం కాదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తుత ఉద్యోగులతో పాటు.. అనేకమంది విశ్రాంత ఉద్యోగులు కూడా ఈ సబ్సిడీ భోజనాన్ని నిత్యం ఉపయోగించుకుంటున్నారు.