వుహాన్ ల్యాబ్ కు అమెరికా నిధులు? సైంటిస్ట్ ఫౌచీపై తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు

వుహాన్ ల్యాబ్  కు అమెరికా నిధులు?  సైంటిస్ట్ ఫౌచీపై తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు

వాషింగ్టన్: చైనాలోని వుహాన్ ల్యాబ్‌‌‌‌లో పరిశోధనలకు అమెరికా టాప్ సైంటిస్ట్, మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ మాజీ చీఫ్ ​మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌచీ నిధులు ఇచ్చారంటూ యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆరేండ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్‌‌‌‌లోనే పుట్టి, లీక్ అయినట్టుగా ప్రచారంలో ఉంది. అయితే, ఆ ల్యాబ్‌‌‌‌లో ప్రమాదకరమైన పరిశోధనలకు అమెరికన్‌‌‌‌ ప్రజలు సొమ్మును ఫౌచీ ఖర్చు పెట్టారని తులసి చెప్పారు. 

యూఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా ఇదివరకే రాజీనామా చేసిన తులసి.. గురువారం చివరిరోజున బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకూ బహిర్గతం కాని కొన్ని రహస్య పత్రాలను విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. వుహాన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ‘గబ్బిలాల కరోనా వైరస్‌‌‌‌లపై ప్రమాదకరమైన గెయిన్- ఆఫ్ -ఫంక్షన్ పరిశోధనల’ కోసం మిలియన్ల డాలర్ల నిధులను ఫౌచీ అందించారని గబ్బార్డ్ చెప్పారు. 

వైరస్ ల్యాబ్- లీక్ గురించిన నిజాలను అణచివేయడానికి ఫౌచీ రాజకీయ నేతలతో అంటకాగిన సీనియర్ అధికారులతో కలిసి పనిచేశారని తెలిపారు. ‘‘కొవిడ్-19పై ఐసీ (ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ) అంచనాలను ప్రభావితం చేయడంలో, మార్చడంలో ఫౌచీ ప్రత్యక్ష పాత్రను ఈ పత్రాలు బట్టబయలు చేస్తున్నాయి. వైరల్ పరిశోధన గురించి ఇంటెలిజెన్స్ అధికారులతో జరిపిన చర్చల పరిజ్ఞానం లేదా భాగస్వామ్యాన్ని ప్రమాణ స్వీకారం చేసి తిరస్కరించినప్పుడు, 2024లో కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) ఎదుట ఫౌచీ ఎలా అబద్ధం చెప్పారో ఇవి చూపిస్తున్నాయి’’ అని తులసీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. 

పెద్ద ఫార్మా కంపెనీలు, ట్రిలియన్ల డాలర్ల విలువైన సార్వత్రిక వ్యాక్సిన్‌‌‌‌ల అన్వేషణకు ముడిపడి ఉన్న ప్రమాదకరమైన కరోనా వైరస్ పరిశోధనలకు ఆయన నిధులు సమకూర్చారని తెలిపింది.