అక్రిడిటేషన్స్ కొత్త జీవోను సవరించాలి : జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి

అక్రిడిటేషన్స్ కొత్త జీవోను సవరించాలి : జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి
  •     టీయూడబ్ల్యూజే (హెచ్143) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా

మెదక్ టౌన్, వెలుగు: రెండేళ్ల తర్వాత జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్స్ జారీ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 252 పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని టీయూడబ్ల్యూజే (హెచ్143) ఉమ్మడి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షుడు జానకిరామ్ గౌడ్, జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి అన్నారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జర్నలిస్టులు మెదక్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి డీఆర్​వో భుజంగరావుకు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు ఉండాలని డిమాండ్ చేశారు. 

రిపోర్టర్స్, డెస్క్ జర్నలిస్టులకు మధ్య విబేధాలు సృష్టించే విధంగా మీడియా కార్డును తీసుకురావడం సరికాదన్నారు. వెంటనే ఈ జీఓను సవరించి జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు​ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (హెచ్143) నాయకులు గోపాల్ గౌడ్, సంగమేశ్వర్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.