టీవీల ధరలు పెరగొచ్చు!

టీవీల ధరలు పెరగొచ్చు!

న్యూఢిల్లీ: విడిభాగాల సరఫరా తక్కువగా ఉండటం, ధరలు ఎక్కువ కావడంతో రేట్లను పెంచాలని మనదేశంలో టీవీ తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం,  చైనాలో కఠినమైన లాక్‌డౌన్‌ల వల్ల  ఆయా దేశాల నుంచి రా మెటీరియల్స్​, స్పేర్​పార్టులు రావడం లేదని తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ కంపెనీలపై యుద్ధం ఎఫెక్ట్ ఉంది. చైనాలో లాక్‌డౌన్లు, పెట్రోల్​ ధరల భారం వల్ల తమ ఖర్చులు పదిశాతం వరకు పెరిగాయని  నోయిడాకు చెందిన   సూపర్ ప్లాస్ట్రోనిక్స్ (ఎస్పీపీఎల్) సీఈఓ అవనీత్ సింగ్ మార్వా చెప్పారు. ఇది వెస్టింగ్‌హౌస్, బ్లూపంక్ట్, థామ్సన్, కొడాక్ టీవీలను తయారు చేస్తుంది. చైనాలో లాక్‌డౌన్‌ల కారణంగా వస్తువులు లేటుగా వస్తున్నాయని అన్నారు. ధరల పెంపుపై కచ్చితమైన అంచనాకు రాలేదని, ఈ నెల నుంచే అమల్లోకి రావచ్చని మార్వా వివరించారు. ఎస్పీపీఎల్ మాదిరిగానే, బెంగళూరుకు చెందిన ఇండ్‌కల్ టెక్నాలజీస్ కూడా ధరల పెంపునకు రెడీ అవుతున్నది. ఇది ఏసర్​ బ్రాండ్ల టీవీలను తయారు చేస్తుంది. పెట్రో ధరల వల్ల కూడా తయారీ ఖర్చు పెరిగిందని పేర్కొంది.