ట్విన్స్ నామకరణం: పాపకు కరోనా.. బాబుకు కోవిడ్..

ట్విన్స్ నామకరణం: పాపకు కరోనా.. బాబుకు కోవిడ్..

లాక్ డౌన్ లో పుట్టడంతో తల్లిదండ్రుల నిర్ణయం

కవలలకు ‘కరోనా’ మరియు ‘కోవిడ్’ గా నామకరణం

ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని మోడీ దేశమంతటా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ టైంలో పుట్టారని కవలలకు కరోనా మరియు కోవిడ్ గా పేర్లు పెట్టిన విచిత్ర సంఘటన చత్తీస్ ఘర్ లోని రాయ్ పూర్ లో జరిగింది.

రాయ్ పూర్ లో నివసించే ప్రీతి వర్మ నెలలు నిండిన గర్భవతి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ జంట వృత్తిరిత్యా రాయ్ పూర్ లోని పురాణి బస్తీ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ప్రీతికి మార్చి 27 తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడం మొదలయ్యాయి. వెంటనే ఆమె భర్త 102 మహతారి ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన వైద్యులు 45 నిమిషాల్లో డెలివరీ చేసి కవలలకు ప్రాణం పోశారు.

‘లాక్ డౌన్ కారణంగా మేం ఆస్పత్రికి వెళ్లే సమయంలో రోడ్లపై వాహనాలు అసలు కనబడలేదు. వాహనాలు లేకపోవడంతో మేం తొందరగా ఆస్పత్రికి చేరుకోగలిగాం. లాక్ డౌన్ ఉన్నందు వల్ల పోలీసులు మా వాహనాన్ని కూడా చాలా సార్లు ఆపారు. కానీ, నా పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే మమ్మల్ని పంపించారు. అయితే అది అర్ధరాత్రి కావడంతో ఆసుపత్రిలో డాక్టర్లు ఉంటారో.. ఉండరో అని నాకు చాలా భయం వేసింది. కానీ, అదృష్టవశాత్తూ వైద్యులు మరియు ఇతర సిబ్బంది కరోనా నియంత్రణ డ్యూటీలో ఉండడం నాకు చాలా మంచిది అయింది. మార్చి 27న మేం డెలివరీ కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకే నేను, నా భర్త.. మా పాపకు కరోనా అని, బాబుకు కోవిడ్ అని పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నాం’ అని కవలల తల్లి ప్రీతి వర్మ తెలిపారు.

ఆసుపత్రికి చెందిన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శుభ్రా సింగ్ మాట్లాడుతూ.. ‘తల్లి మరియు శిశువులు ఇటీవలే సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. వర్మ కేసు కాంప్లికేటేడ్ కేసు కావడంతో.. ఆమె తన భర్తతో ఆసుపత్రికి చేరుకున్న వెంటనే ఆమెకు సిజేరియన్ చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశాం. వాళ్లు వచ్చిన 45 నిమిషాల్లోనే విజయవంతంగా డెలివరీ జరిగింది’ అని తెలిపారు. లాక్ డౌన్ టైంలో పుట్టినందువల్ల ఆ కవలలకు కరోనా, కోవిడ్ పేర్లు పెట్టడంతో ఇప్పుడు వారిరువురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని ఆయన అన్నారు.

For More News..

100 కోట్ల ఆర్థికసాయం ప్రకటించిన వరల్డ్ బ్యాంక్

నేటి నుంచి 10 లక్షల మందికి ఉచిత భోజనం

ఏపీకి అరబిందో ఫార్మా భారీ సాయం

10 లక్షల కేసులు.. 51 వేల మరణాలు