ఇండియాలో ట్విట్టర్ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ లాంఛ్

ఇండియాలో ట్విట్టర్ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ లాంఛ్

ట్విట్టర్ ప్రీమియం సబ్‍స్క్రిప్షన్ సర్వీస్ ఇండియాలోనూ ప్రారంభమైంది. బ్లూ టిక్ కోసం వసూలు చేసే మొత్తాన్ని ట్విట్టర్ ప్రకటించింది. మొబైల్ యూజర్లు నెలకు రూ.900, వెబ్ యూజర్లు రూ.650 చొప్పున సబ్‍స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నెలవారీతో పాటు యానువల్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒకేసారి ఏడాది సబ్‍స్క్రిప్షన్ తీసుకునే వారు రూ.6,800చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది. ఈ లెక్కన యానువల్ సబ్‍స్క్రిప్షన్ తీసుకున్న వారు నెలకు రూ.566 చొప్పున చెల్లించినట్లవుతుంది. సబ్‍స్క్రిప్షన్ తీసుకున్న వారికి బ్లూ టిక్ తో పాటు ట్వీట్స్ ఎడిట్ ఆప్షన్, ఎక్కువ నిడివి గల వీడియోలు పోస్ట్ చేయడం, బుక్‍ మార్క్ ఆర్గనైజింగ్, కస్టమ్ యాప్ ఐకాన్స్, ఎన్ఎఫ్‍టీలను ప్రొఫైల్ పిక్చర్లుగా మార్చుకునే ఫీచర్లు అందించనుంది. ఇండియాలోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది.

యూఎస్ లో ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ ధర ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు నెలకు 11 డాలర్లు, వెబ్‌లో 8డాలర్లుగా నిర్ణయించింది. అక్కడ యానువల్ ఫీ 84 డాలర్లుగా ఉంది. అయితే ఇప్పటివరకు సెలెబ్రిటీలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు, ప్రముఖులు, మీడియా సంస్థలకే బ్లూ ట్లిక్ ఉండేది. కానీ టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న తర్వాత కొత్త రూల్ తీసుకొచ్చారు. ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ తీసుకున్న వారందరికీ బ్లూటిక్ లభిస్తుందని ప్రకటించారు. దాంతో పాటు పోస్ట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునేలా ఎడిట్ ట్వీట్ ఆప్షన్ కూడా ఈ సబ్‍స్క్రిప్షన్ తో పాటు రానుంది. ఇంకో ముఖ్య విషయమేమిటంటే బ్లూ టిక్ సబ్‍స్క్రిప్షన్ తీసుకోవాలంటే ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి 90 రోజులై ఉండాలని స్పష్టం చేసింది.