సింగరేణిలో కొత్త గనులు రాకుండా అడ్డుకున్నరు: మంత్రి వివేక్ వెంకటస్వామి

సింగరేణిలో కొత్త గనులు  రాకుండా అడ్డుకున్నరు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌ పదేండ్ల పాలనలో సంస్థను దెబ్బతీశారు: మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి
  •     కొత్త గనుల కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంది
  •     జీవో 76 పునరుద్ధరించి సింగరేణి జాగలకు పట్టాలిస్తం
  •     ఆస్తుల కోసమే కేసీఆర్‌‌‌‌ ఇంట్లో పంచాయితీ అని కామెంట్
  •     క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో ప్రచారం

కోల్​బెల్ట్/కోటపల్లి, వెలుగు: పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్ పాలనలో సింగరేణిలో కొత్తగా ఒక్క బొగ్గు గనిని కూడా తవ్వలేదని, కొత్త మైన్స్ రాకుండా ఆ పార్టీ లీడర్లు అడ్డుకున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి,చెన్నూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రామకృష్ణాపూర్ బీజోన్ సెంటర్‌‌‌‌తో పాటు పలు వార్డుల్లో కార్నర్ మీటింగ్‌‌ల్లో మాట్లాడారు. గత బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో సింగరేణి సంస్థ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక సింగరేణికి కొత్త బొగ్గు గనులు తీసుకువచ్చేందుకు వేలం పాటలో పాల్గొనేందుకు పర్మిషన్ ఇచ్చిందని తెలిపారు. సింగరేణి బీఐఎఫ్‌‌ఆర్ పరిధిలోకి వెళ్లి నష్టాల్లో ఉన్నప్పుడు సంస్థను కాపాడేందుకు అప్పటి కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి ఎన్టీపీసీతో రూ.400 కోట్ల రుణం ఇప్పించారని గుర్తుచేశారు. 

సింగరేణి ఖాళీ స్థలాల్లో కట్టుకున్న ఇండ్లకు పట్టాలిప్పించే అంశంపై కేబినెట్‌‌లో చర్చించామని, త్వరలో జీవో 76 పునరుద్ధరించి అందరికీ పట్టాలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి డీఎంఎఫ్‌‌టీ, సీఎస్‌‌ఆర్ నిధులను కేసీఆర్ కుటుంబసభ్యులు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌‌కు తరలించుకుపోయారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు నుంచి నిధులు తరలించుకుపోతున్నా.. బాల్క సుమన్ అడ్డుకోలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న వేల కోట్ల ఆస్తులు పంచుకోవడం కోసం కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య కొట్లాట జరుగుతుందని చెప్పారు. స్వయంగా కేసీఆర్ బిడ్డ కవిత ఆస్తుల కోసం పంచాయితీ నడుస్తుందని చెప్పుతున్నదన్నారు.మరోవైపు, నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని మంత్రి వివేక్‌‌ స్పష్టం చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ప్రచారంలో డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, స్థానిక లీడర్లు పాల్గొన్నారు.

కాళేశ్వరం పరిహారం చెక్కుల పంపిణీ..

కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపునకు గురైన భూముల రైతులకు మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి నష్ట పరిహారం చెక్కులను అందజేశారు. సోమవారం రాత్రి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెలక గ్రామంలో 192 ఎకరాలకు సుమారు రూ.17,44,655 పరిహారాన్ని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్​రావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌‌ మాట్లాడుతూ, కమీషన్ల కోసమే కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చెన్నూరు నియోజకవర్గ రైతుల నుంచి 264 ఎకరాలను సేకరించారన్నారు. ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్లకు 24 గంటల్లో బిల్లులు మంజూరు చేసిన బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్‌‌‌‌.. రైతులకు మాత్రం ఏండ్లు గడిచినా పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులకు పరిహారం ఇవ్వాలని తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యే అయ్యాక రైతులకు పరిహారం ఇప్పించడమే లక్ష్యంగా పనిచేసినట్లు చెప్పారు. పరిహారంపై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.32 కోట్ల పరిహారం మంజూరుకు కృషి చేసినట్లు చెప్పారు. బాధిత రైతుల కండ్లలో సంతోషాన్ని చూశానన్నారు. మిగిలిన రైతుల పరిహారం త్వరలోనే పంపిణి చేస్తామని, కొందరు భూములు కోల్పోయిన రైతులకు రీసర్వే చేయాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పరిహారం పొందిన రైతులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మహేశ్ తివారీ, కోటపల్లి తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, సర్పంచ్‌‌ మూల ప్రదీప్ రెడ్డి, కాంగ్రెస్ నేత మూల సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌‌లోకి బీఆర్‌‌‌‌ఎస్ నేత చెరుకు సరోత్తంరెడ్డి..

మంచిర్యాల జిల్లా భీమారం మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ చెరుకు సరోత్తంరెడ్డి కాంగ్రెస్‌‌లో చేరారు. సోమవారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయనకు కాంగ్రెస్‌‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భీమారం, మండలాల్లో మంచి పట్టున్న సరోత్తంరెడ్డి బీఆర్‌‌‌‌ఎస్‌‌కు గుడ్‌‌బై చెప్పడంతో ఆ పార్టీ నాయకులు షాక్‌‌కు గురయ్యారు. సరోత్తంరెడ్డి కూతురు డాక్టర్ దీపికా రెడ్డి భీమారం ఎంపీపీగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మంత్రి వివేక్ వెంకటస్వామి చేపడుతున్న అభివృద్దికి ఆకర్షితుడినై కాంగ్రెస్‌‌లో చేరినట్లు సరోత్తం రెడ్డి తెలిపారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్, సాధనబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.