- మంటలు చెలరేగిన ‘కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్’లోనే కీలక డాక్యుమెంట్లు
- ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్ని ప్రమాదంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఏడు డివైజెస్ ఓవర్ హీట్
- రిపోర్ట్ సిద్ధం చేసిన ఎఫ్‌ఎస్‌ఎల్.. డేటాపైనే అనుమానాలు
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు విచారణ తర్వాత కూడా కీలక ఆధారాలు సేకరించిన సిట్
హైదరాబాద్, వెలుగు: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్) అగ్ని ప్రమాదంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఏడు టెక్నికల్ ఎవిడెన్స్(మెటీరియల్ ఆబ్జెక్ట్స్) పాక్షికంగా ధ్వంసమైన నేపథ్యంలో సిట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిన పలు సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ అగ్నిప్రమాదంలో ఓవర్ హీట్ అయినట్లు గుర్తించారు. వీటికి సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్ ఇచ్చిన రిపోర్టుల అంశాల ఆధారంగా డేటాను పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఏడు మెటీరియల్ ఆబ్జెక్ట్స్ పాక్షికంగా ధ్వంసమయ్యాయని ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ శిఖాగోయల్ ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే.
జనవరిలో ల్యాబ్‌కు వచ్చిన వీటికి సంబంధించి ఇప్పటికే రిపోర్ట్ సిద్ధం చేశామని, డేటా రిట్రీవ్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఏడు ఆబ్జెక్ట్స్‌ను గుర్తించేందుకు సిట్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రధానంగా డిసెంబర్, జనవరి నెలల్లో డిపాజిట్ చేసిన మెటీరియల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీజ్ చేసిన మెటీరియల్ అబ్జెక్ట్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలించిన తేదీల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. ఒకవేళ సంబంధిత డేటా ధ్వంసమైతే రిట్రీవ్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో సెల్ ఫోన్లు,ల్యాప్‌టాబ్స్
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ వ్యవహారానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్న పలువురు అనుమానితులను సిట్ విచారిస్తున్నది. గత మూడు నెలల వ్యవధిలో కీలక సాంకేతిక ఆధారాలను (మెటీరియల్ ఆబ్జెక్ట్స్) సేకరించి ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్, ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్‌రావుకు చెందిన ఫోన్లు, ల్యాప్‌టాప్స్ సహా కీలకమైన సాంకేతిక ఆధారాలను ఎఫ్‌ఎస్‌ఎల్ ద్వారా కోర్టుకు అందించారు.
ఈ క్రమంలోనే నిందితుల వాంగ్మూలాలు, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టుల ఆధారంగా గత నెలలో హరీశ్‌రావు, కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించారు. దర్యాప్తులో భాగంగా జనవరిలో పలు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సీజ్ చేసి ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షలకు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు సిట్‌కు అందాల్సి ఉంది.
ఎఫ్‌ఎస్‌ఎల్ సర్వర్ల బ్యాకప్ సవాల్!
అగ్ని ప్రమాదంలో ఫోరెన్సిక్ ల్యాబ్ సర్వర్ రూమ్‌లోని కంప్యూటర్లకు బ్యాకప్ లేదని సమాచారం. దీంతో సర్వర్ సహా కంప్యూటర్ల డేటాను బ్యాకప్ చేయడం డిపార్ట్‌మెంట్‌కు సవాల్‌గా మారినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ సహా తీవ్రమైన నేరాల్లో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు ఎఫ్‌ఎస్‌ఎల్ బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులో గల ‘కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్’లో భద్రపరుస్తుంటారు. ఇందులో ఫోన్ ట్యాపింగ్ కేసు అనుమానితుల మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు ఉన్నట్లు తెలిసింది. అగ్నిప్రమాదం తర్వాత ఎఫ్ఎస్ఎల్ రూపొందించిన రిపోర్టులను సిట్ సేకరిస్తున్నది.
రిపోర్టుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్‌లో సీజ్ చేసిన డివైజెస్‌లోని డేటా భద్రంగా ఉందా..? లేదా అనేది గుర్తించేందుకు నిపుణుల సహకారం తీసుకుంటున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. రికార్డులన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రిజిస్టర్ అవుతాయని వెల్లడించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌లోని మెటీరియల్ ఆబ్జెక్ట్స్‌కు నష్టం జరుగకపోవచ్చని తెలిపారు.
