భారత్ లో 500 అకౌంట్స్ ను నిలిపివేసిన ట్విట్టర్

భారత్ లో 500 అకౌంట్స్ ను నిలిపివేసిన ట్విట్టర్

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఖాతాలను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై స్పందించింది ట్విట్టర్ సంస్థ. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొన్ని ఖాతాలను భారత్ లో నిలిపివేశామని  తెలిపింది. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు, మీడియాకు సంబంధించిన ఖాతాలను మాత్రం రద్దు చేయలేదని స్పష్టంచేసింది. అలా చేయడం భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకమని అభిప్రాయపడింది. చట్టం పరిధిలో భావ ప్రకటనా స్వేచ్ఛను వ్యక్తపరిచేందుకు.. ట్విటర్  యూజర్లకు ఉన్న హక్కును సమర్థిస్తున్నట్లు తెలిపింది. తీసుకున్న చర్యలను కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్  మంత్రిత్వశాఖకు తెలియజేసినట్లు తెలిపింది.

హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న హ్యాష్ ట్యాగ్ లు కనపడకుండా చర్యలు తీసుకున్నామని కేంద్రానికి తెలిపింది ట్విటర్ సంస్థ. కేంద్రం చెప్పిన వాటిలో 500 ఖాతాలపై చర్యలు తీసుకున్నామంది. ట్విట్టర్  నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న కొన్నింటిని శాశ్వతంగా రద్దు చేసినట్లు స్పష్టంచేసింది. రైతుల ఆందోళనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారంటూ.. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్  మంత్రిత్వశాఖ కంప్లైంట్ చేసింది. అలా తప్పుడు సమాచారం చేరవేసే 11వందల 78 ఖాతాలను నిలిపివేయాలని, ఆ ట్వీట్లను వెంటనే తొలగించాలని ట్విటర్ ను ఆదేశించింది. దీంతో నిబంధనలకు అనుగుణంగా తీసుకున్న చర్యలను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాసింది ట్విట్టర్ .